రాజ్యాంగం ఉండాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలి : జూపల్లి కృష్ణారావు

వంగూర్, వెలుగు: రాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని, అదే జరిగితే రిజర్వేషన్లను తొలగిస్తారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గురువారం వంగూరు, చారకొండ మండలాల్లో ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీల హక్కులను బీజేపీ లాక్కునే ప్రయత్నం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో పేదల బతుకులు మారాలంటే కాంగ్రెస్  పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రజలంతా ఒక్కటై బీజేపీని గద్దె దించాలని పిలుపునిచ్చారు. పదేండ్ల మోదీ పాలనలో దేశ ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను అదానీ, అంబానీలకు కట్టబెడుతున్నాడని ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్  ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్  తోడుదొంగలని విమర్శించారు. ఎంపీగా మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ, మాజీ మంత్రి రవీంద్ర నాయక్, మల్లు రవి సతీమణి రాజ బన్సీదేవి, జడ్పీ వైస్  చైర్మన్  ఠాగూర్  బాలాజీసింగ్  పాల్గొన్నారు.

ఆమనగల్లు: మహిళల సాధికారికత కాంగ్రెస్ తోనే సాధ్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆమనగల్లు మండలం రాంనుంతలలోని ఓ ఫంక్షన్ హాల్ లో మహిళా సంఘాల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్  ప్రభుత్వం మహిళల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. రూ.500 సిలిండర్, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రవేశపెడితే ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని విమర్శించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్  పాల్గొన్నారు.