బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలి : మంత్రి జూపల్లి

వీపనగండ్ల. వెలుగు: గత ప్రభుత్వ వైఫల్యం వల్ల ఉమ్మడి పాలమూరు జిల్లాలో తాగునీటికి కష్టాలు పడాల్సి వస్తోందని, వచ్చే పార్లమెంట్​ ఎన్నికల్లో బీఆర్ఎస్​ను బొంద పెట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. వీపనగండ్ల, చిన్నంబావి, పాన్​గల్  మండలాలకు తాగునీటిని అందించే గోపాల్ దిన్నె రిజర్వాయర్​ను మంత్రి పరిశీలించారు. అనంతరం జూరాల ప్రాజెక్ట్​ ఆఫీసర్లతో ఫోన్​లో మాట్లాడి నీటి నిల్వపై ఆరా తీశారు. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

ఓ మాజీ మంత్రి బంధువు వ్యవసాయ పొలానికి ప్రత్యేక పైప్​లైన్  ఏర్పాటు చేసుకొని 50 హెచ్​పీ మోటార్ సాయంతో అక్రమంగా నీటిని తరలించుకుపోతున్న విషయాన్ని పలువురు రైతులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి జూరాల, విద్యుత్​ శాఖ ఆఫీసర్లతో మాట్లాడి మోటార్ కు కరెంట్​ కనెక్షన్​ తొలగించాలని ఆదేశించారు. అక్రమంగా విద్యుత్​ వినియోగించుకున్నట్లు తేలితే కేసు నమోదు చేయాలని విద్యుత్​ శాఖ ఎస్ఈకి సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాగునీటి అవసరాల కోసం జూరాల ప్రాజెక్టుకు 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్నాటక ప్రభుత్వంతో ఇప్పటికే సీఎం మాట్లాడారని తెలిపారు. 

చిన్నంబావి, వీపనగండ్ల, పాన్​గల్  మండలాల తాగునీటి అవసరాలకు జూరాల నుంచి నీటిని వదిలేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కొల్లాపూర్ ప్రాంతానికి సింగోటం,​ జొన్నల బగుడా రిజర్వాయర్  ద్వారా సాగునీటిని అందిస్తామన్నారు. గత ప్రభుత్వం ముందుచూపు లేకుండా నీటిని వృథా చేసిందని విమర్శించారు. పార్లమెంట్  ఎన్నికల్లో లబ్ధి పొందడానికి సాగునీటి విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్న బీఆర్ఎస్​ పార్టీని బొంద పెట్టాలన్నారు. రాంచంద్రారెడ్డి, బాల్​రెడ్డి, నారాయణరెడ్డి, ఎత్వం కృష్ణయ్య, గంగిరెడ్డి, బీచుపల్లి, రంజిత్ కుమార్  పాల్గొన్నారు.
 

తాగునీటిని అందించాలి..
 

చిన్నంబావి: వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా  చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మండలంలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.