వైసీపీ కి షాక్: మంత్రి రాజీనామా, టీడీపీ నుండి పోటీ..!

2024 ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఏపీలో పార్టీ ఫిరాయింపుల పర్వం ఊపందుకుంది. ఇప్పటికే అధికార ప్రతిపక్షాలు మెజారిటీ స్థానాలకు అభ్యర్థుల జాబితా ప్రకటించిన నేపథ్యంలో సీటు దక్కనివారు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. అన్ని పార్టీలకంటే ముందే జాబితా ప్రకటించి ఎన్నికల శంఖారావాన్ని పూరించిన సీఎం జగన్ కు అసమ్మతి సెగ గట్టిగానే తగులుతోంది. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం తాము ఆశించిన సీటు దక్కకపోవడంతో ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు.

తాజాగా మంత్రి గుమ్మనూరు జయరామ్ వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరనున్నారని సమాచారం అందుతోంది. ప్రస్తుతం కార్మిక శాఖ మంత్రిగా ఉన్న జయరామ్ కు వచ్చే ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ నుండి ఎంపీ సీటు కేటాయించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలూరు నియోజకవర్గం కేటాయించకపోవటంతో జయరామ్ పార్టీని వీడాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

వైసీపీకి వీడాలని ఫిక్స్ అయిన మంత్రి మంగళవారం సాయంత్రం ఉండవల్లిలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారని సమాచారం. కర్నూలు నుండి విజయవాడకు అనుచరులతో కలిసి భారీ ర్యాలీతో వెళ్లి టీడీపీ కండువా కప్పుకోనున్నాడు జయరామ్. ఇప్పటికే జయరామ్ తో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు ఆయనకు గుంతకల్ నియోజకవర్గానికి టికెట్ కన్ఫార్మ్ చేసినట్లు సమాచారం అందుతోంది.