ధాన్యం కొనుగోళ్లు స్పీడప్ ​చేయాలి : దామోదర రాజనర్సింహ

  • మంత్రి దామోదర రాజనర్సింహ 

మెదక్, వెలుగు: ధాన్యం కొనుగోళ్లు స్పీడప్​చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా గ్రంథాలయంలో ధాన్యం కొనుగోలు,  మిల్లర్స్ అండర్ టేకింగ్, డిఫాల్ట్ మిల్లుల సమస్యలపై సివిల్​సప్లై, రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో రైతులు కొనుగోలు సమస్యలతో ఇబ్బందులు పడకూడదన్నారు. రైస్ మిల్లర్స్ అండర్ టేకింగ్ త్వరగా సబ్​మిట్​ చేసి ధాన్యం దింపుకునేలా చూడాలన్నారు.

లక్షన్నర మెట్రిక్ టన్నుల  ధాన్యం జిల్లాలో దిగుమతి సాధ్యం కాదని ఇతర జిల్లాలకు పంపించాల్సిన అవసరం ఉందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకురాగా సివిల్​సప్లై కమిషనర్ తో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతకుముందు డిఫాల్ట్ మిల్లులకు సంబంధించి , అన్ ఫాల్ట్ బియ్యం పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని 25 శాతం బ్యాంకు గ్యారంటీ ఇప్పించాలని మంత్రికి మిల్లర్లు వినతి పత్రం ఇచ్చారు.

ఈ మేరకు10 శాతం బ్యాంకు గ్యారంటీ ఇచ్చేలా సంబంధిత నివేదికలు తయారు చేయాలని కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు. కలెక్టర్ రాహుల్ రాజ్, ఎమ్మెల్యే రోహిత్ రావు, అడిషనల్ కలెక్టర్ నగేశ్, సివిల్​సప్లై డీఎం హరికృష్ణ, డీఎస్ వో సురేశ్ రెడ్డి, డీఆర్డీవో  శ్రీనివాసరావు పాల్గొన్నారు.

పీఏసీఎస్​ బిల్డింగ్ ప్రారంభించిన మంత్రి

కౌడిపల్లి: మండలంలోని మహమ్మద్ నగర్ గేటు వద్ద రూ.54 లక్షలతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) కొత్త బిల్డింగ్​ను మంత్రి దామోదర​ రాజనర్సింహ ప్రారంభించారు. సొసైటీ చైర్మన్ బాన్సువాడ గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. 

అనంతరం కౌడిపల్లిలోని గవర్నమెంట్​ డిగ్రీ కాలేజీలో స్టూడెంట్స్​తో మాట్లాడారు. ఇక నుంచి షిఫ్టింగ్ పద్ధతిలో కాంకుడా స్టూడెంట్స్​కు సొంత భవనంలోనే విద్యా బోధన ప్రారంభించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ నర్సాపూర్ ఇన్​చార్జి ఆవుల రాజిరెడ్డి, డీసీవో కరుణ, డీఏవో గోవింద్ పాల్గొన్నారు.

 డయాలసిస్​ కేంద్రం ప్రారంభం

నర్సాపూర్: నర్సాపూర్ ఏరియా ఆస్పత్రిలో ఐదు పడకల సామర్థ్యంతో రూ.50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ ను ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే సునీతా రెడ్డి, కలెక్టర్ రాహుల్ రాజ్ తో కలిసి మంత్రి దామోదర ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మెదక్ జిల్లా ఆస్పత్రిలో సుమారు 100 మందికి పైగా డయాలసిస్ రోగులు చికిత్స పొందుతున్నారని వారిలో 22 మంది నర్సాపూర్​కు చెందిన వారన్నారు. త్వరలో ఐసీయూ ఎన్ టీసీ ట్రామా అత్యవసర శాఖలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.