మన్మోహన్ సింగ్ మరణందేశానికి తీరని లోటు : మంత్రి దామోదర రాజనర్సింహ

  • ఆయన మానవతావాది, దార్శనికుడు: మంత్రి దామోదర 

హైదరాబాద్, వెలుగు: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గొప్ప మానవతావాది, దార్శనికుడు, ఆర్థిక రూపశిల్పి అని, ఆయన మరణం దేశానికి తీరని లోటని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.  మన్మోహన్ సింగ్ ఆర్థికవేత్తగా, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్​గా, ఆర్బీఐ గవర్నర్​గా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా, దేశ ప్రధానిగా దేశంలో చెరగని ముద్ర వేశారని అన్నారు.  మన్మోహన్ సింగ్ మృతిపై అసెంబ్లీలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి​ ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ బలపరిచారు.

మన్మోహన్ సింగ్​కు భారతరత్న ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన తీర్మానానికి పూర్తి మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రధానిగా మన్మోహన్ ఆర్థిక స్థిరత్వం, విద్య, వైద్యం, ఉపాధి రంగాలకు సంబంధించి చారిత్రక చట్టాలను రూపొందించారన్నారు. ఉపాధి హామీ పథకాన్ని తెచ్చి గ్రామీణ ప్రాంత ప్రజలు వలస పోకుండా ఉపాధి కల్పించారని తెలిపారు.