విద్యా వైద్య రంగాలకు పెద్దపీట

  • మంత్రి దామోదర రాజనర్సింహ
  • ఆందోల్ లో 150 పడకల ఆస్పత్రి, నర్సింగ్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన

జోగిపేట, వెలుగు: ఆందోల్ నియోజకవర్గం విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి చెందడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం ఆందోల్ లో కొత్తగా మంజూరైన నర్సింగ్ కాలేజీ, 150 పడకల ఆస్పత్రి భవన నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం కస్తూర్బా స్కూల్,​ పాలిటెక్నిక్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ  స్టూడెంట్స్​తో కలిసి బర్త్​డే వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టూడెంట్స్​విద్యతో పాటు సంస్కారం అలవర్చుకోవాలన్నారు. 

మన ధర్మమే మనల్ని కాపాడుతుందన్నారు.  విద్యతో పాటు వినయ విధేయతలు కలిగి ఉండాలని సూచించారు. సంస్కారవంతమైన విద్య వల్ల స్టూడెంట్స్​ఉత్తమ పౌరులుగా మారుతారన్నారు. సమాజం పట్ల సేవాభావంతో ఉండాలన్నారు. నిర్దిష్ట లక్ష్యాన్ని ఎంపిక చేసుకొని ఆ లక్ష్యసాధన కోసం నిరంతరం శ్రమించాలన్నారు. ఆందోల్ నియోజకవర్గాన్ని విద్య, వైద్య పరంగా అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు తెలిపారు.

సుల్తాన్​పూర్​జేఎన్టీయూ కాలేజీలో సైన్స్ సెంటర్ ఏర్పాటు చేయడం, ఆందోల్ లో నర్సింగ్ కాలేజ్,150 పడకల ఆస్పత్రి ఏర్పాటు లాంటి అభివృద్ధి కార్యక్రమాలతో ఈ ప్రాంతం విద్యా వైద్య పరంగా ఎంతగానో అభివృద్ధి చెందుతుందని, ఇక్కడి స్టూడెంట్స్​కు ఉన్నత విద్యా అవకాశాలు మెరుగవుతాయని మంత్రి తెలిపారు.

అనంతరం స్టూడెంట్స్​తో కలిసి మంత్రి దంపతులు భోజనాలు చేశారు. కాగా పార్టీ శ్రేణులు భారీ గజమాలను క్రేన్​సాయంతో మంత్రి మెడలో వేసి సత్కరించారు. కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేశ్ షెట్కార్, సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, కలెక్టర్ క్రాంతి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజయ్య, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, ఆర్డీవో పాండు, డీఎస్పీ సత్య గౌడ్,  మార్కెట్ కమిటీ చైర్మన్లు, తహసీల్దార్​విష్ణు సాగర్, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, కాలేజీ ప్రిన్సిపాల్స్​,  సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.