విద్య, వైద్యంపై టాస్క్ ఫోర్స్

  • నేషనల్ హైవే  44పై ట్రామా కేర్ సెంటర్
  •  మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో త్వరలో సీటీ స్కాన్ సౌకర్యం
  • వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ 

మెదక్, వెలుగు: జిల్లాలో విద్య, వైద్య రంగాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. బుధవారం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌లో వివిధ శాఖల అభివృద్ధిపై సమీక్ష  నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..  ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ప్రతి విద్యార్థికి మెరుగైన విద్య, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారికి నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

అన్ని స్కూల్స్ లో వసతులు మెరుగుపరచడం, అసంపూర్తి పనులు పూర్తి చేయడం, విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం, ప్రభుత్వాసుపత్రుల్లో వసతుల మెరుగు, అన్ని రకాల రోగాలకు చికిత్స అందించే ఏర్పాటు చేయడం టాస్క్ ఫోర్స్ ఉద్దేశమన్నారు. 44 వ నంబర్ నేషనల్ హైవే పై ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.  మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో త్వరలోనే సీటీ స్కాన్ సౌకర్యం అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.

 కొత్త మండలాల్లో పీహెచ్‌సీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మెదక్ మెడికల్ కాలేజీకి బిల్డింగ్, మౌలిక వసతులు ఉన్నాయని, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు  వచ్చారని, పర్మిషన్ కోసం ఏంఎంసీకి మరోమారు అప్పీల్ చేస్తామన్నారు. ఈసారి పర్మిషన్ వస్తుందన్న నమ్మకం ఉందని మంత్రి తెలిపారు. 

భూమి సమస్యల పరిష్కారానికి...

గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సు నిర్వహించి భూ సమస్యలను పరిష్కరించాలని మంత్రి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ధరణికి సంబంధించి పెండింగ్ దరఖాస్తులు అన్నీ పరిష్కరించాలన్నారు.