శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకున్న మంత్రి దామోదర రాజనర్సింహ

శ్రీశైలం, వెలుగు: శ్రీశైలం భ్రమరాంబిక, మల్లికార్జునస్వామిని బుధవారం మంత్రి దామోదర రాజనర్సింహ దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ రాజగోపురం వద్ద అర్చకులు, ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం స్వామి, అమ్మవారిని దర్శించుకుని మల్లికార్జునస్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని తులాభారం నిర్వహించుకున్నారు. అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో మంత్రికి వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలు, స్వామి అమ్మవారి ఫొటోను అందజేశారు.

కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మాణం

అమ్రాబాద్: నాగర్​కర్నూల్​ జిల్లా అమ్రాబాద్​ మండలం మద్దిమడుగు వద్ద కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణంతో రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. బుధవారం శ్రీశైలం నుంచి తిరిగి వస్తూ మన్ననూర్  ఫారెస్ట్  గెస్ట్  హౌజ్  వద్ద ఆగారు. ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ స్థానిక సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఏజెన్సీ ప్రజలకు మెరుగైన వైద్యం, సాగు నీరు, కృష్ణానదిపై వంతెన నిర్మాణం తదితర అంశాలను ప్రస్తావించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్లమల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సాగునీరు అందించేందుకు కేఎల్ఐ పనులను వేగవంతం చేసి ఉమ్మడి అమ్రాబాద్ మండలానికి సాగునీటిని అందిస్తామని చెప్పారు. మద్దిమడుగు వద్ద కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మాణానికి రెండు తెలుగు రాష్ట్రాలు సమన్వయంతో కేంద్ర ప్రభుత్వ అనుమతి పొందేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. హరి నారాయణ గౌడ్, పంబలి బుచ్చయ్య, రహీం, వెంకట రమణ, సత్యనారాయణ, జాకీర్  పాల్గొన్నారు.