టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈసారి ఎన్నికల్లో టీడీపీ నావ పూర్తిగా మునిగిపోతుందని జోస్యం చెప్పారు. మునిగిపోయే నావను కాపాడుకునేందుకు చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని అంబటి వ్యాఖ్యానించారు. పల్నాడులో ఏడుగురు టీడీపీ అభ్యర్థులను ఓడించిన సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు. తన ఎమ్మెల్యేలను ఓడించే దమ్ము చంద్రబాబుకు లేదని మంత్రి అంబటి తేల్చి చెప్పారు. తన గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని లేదంటే చంద్రబాబు బండారం బయట పెడుతానని హెచ్చరించారు.
‘ఆంబోతు.. ఆంబోతు..’ అంటూ తనను విమర్శించడంపై ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు పెద్ద చీటర్ 420 అని విమర్శించారు. తనపై విమర్శలు చేసే సమయంలో నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. లేదంటే చంద్రబాబు చరిత్ర అంతా ప్రజల ముందు ఉంచుతానని వార్నింగ్ ఇచ్చారు. మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఎవరని ప్రశ్నించారు. కోడెల మరణానికి చంద్రబాబునే కారణమని ఆరోపించారు. చంద్రబాబు చెత్తగా రాష్ట్రాన్ని పాలించాడని, అందుకే ఆయనకు 23 సీట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు.
టీడీపీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ (Kodela Shiva Prasad) మరణానికి చంద్రబాబు (Chandra Babu) కారణమని ఏపీ మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) సంచలన వ్యాఖ్యలు చేశారు. సత్తెనపల్లిలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో కోడెల ఓటమి పాలైతే కనీసం ఆయనను పలకరించకపోగా వారి కుటుంబాన్ని రాజకీయంగా పక్కకు పెట్టడడంతో కోడెల మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. కోడెల లాంటి రాజకీయ నాయకుడు రాజకీయంగా శత్రువులకు బయపడే వారు కాదని అన్నారు. కోడెల ఆత్మహత్యకు వైఎస్ జగన్ కారణమని చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పిగొట్టారు. కోడెల పేరుతో ఎన్నికల్లో లబ్దిపొందడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కోడెలపై ప్రేమ ఉంటే వారి కుటుంబంలో ఒకరికి టికెట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.