సొల్యూషన్ మత్తులో జోగుతూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న మైనర్ బాలురను రేణిగుంట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం గుంట కట్ట సమీపంలో కొందరు పిల్లలు స్కూల్ కు వెళ్లకుండా అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో రేణిగుంట పోలీసులు నిఘా ఉంచారు.
పాఠశాల సమీపంలో పది మంది పిల్లలు తాము తెచ్చుకున్న వైట్నర్, సొల్యూషన్,నెయిల్ పాలిష్ రిమూవర్ లు పీలుస్తూ మత్తులో తూలుతూ ఉండటాన్ని గుర్తించిన పోలీసులు, వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ పిల్లలను ఎంక్వయిరీ చేయగా తామంతా సమీప పాఠశాలలో చదువుతున్న విద్యార్థులుగా తెలిపారు.
విషయం అర్బన్ సీఐ అంజు యాదవ్ వద్దకు తీసుకెళ్లడంతో… ఆమె ఆ పిల్లల తల్లిదండ్రులను పిలిపించి గట్టిగా మందలించారు. పిల్లలను అదుపాజ్ఞలో పెట్టుకోవాల్సిందిగా సూచించారు.పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చి మరోసారి ఇలాంటి పనులు చేయవద్దని తెలుపుతూ ఇంకొకసారి ఇలాంటి పనులు చేస్తే కఠిన చర్యలు చేపడతానాని హెచ్చరించారు.ఈ క్రమంలో పిల్లలు మైనర్లు కావడంతో సీఐ అంజు యాదవ్ వారి పేర్లను వెల్లడించలేదు ఫోటోలు తీయడానికి అనుమతించలేదు.
అనంతరం ఆమె… మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి నుండి పిల్లలను అదుపాజ్ఞలో ఉంచుకోకపోతే భవిష్యత్తులో సమాజానికి పెద్ద ప్రమాదం పొంచి ఉందన్నారు.సంఘ విద్రోహులుగా మారే అవకాశం ఉందన్నారు.కాబట్టి తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ధ వహించి వారు ఏమి చేస్తున్నారో గమనించాలన్నారు.చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందు జాగ్రత్త పడడం మంచిదన్నారు.
