- ఉమ్మడి జిల్లాలో 66 మిల్లులకు ధాన్యం కేటాయింపు
- గతంలో డిఫాల్ట్ అయిన మిల్లులకు వడ్లు లేవ్
- లక్ష మెట్రిక్ టన్నులకు చేరిన ధాన్యం కొనుగోళ్లు
ఖమ్మం/భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సన్న ధాన్యం మిల్లింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఖమ్మం జిల్లాలో 61 మిల్లులకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు మిల్లులకు ఆఫీసర్లు ధాన్యం కేటాయించారు. ఖమ్మం జిల్లాలో అంతకుముందు కేటాయించిన ధాన్యానికి సంబంధించి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) పెండింగ్ ఉన్న నాలుగు మిల్లులను ఇప్పటికే డీఫాల్టర్ల జాబితాలో చేర్చారు. ఆ నాలుగు మిల్లులకు ఈసారి ధాన్యం కేటాయించడం లేదని ఆఫీసర్లు స్పష్టం చేశారు.
మిగతా మిల్లులతో పాటు గతంలో ధాన్యం తీసుకోని కొన్ని కొత్త మిల్లులు కూడా ఈసారి ముందుకు వచ్చాయి. ఇప్పటి వరకు ఆసక్తి చూపించిన 61 మిల్లుల కనీస అర్హత 22,37,500 క్వింటాళ్లు కాగా, అందులో 45 శాతానికి ప్రస్తుతం ధాన్యం నిల్వలు ఆ మిల్లులకు చేరాయి. 10,00,951 క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లులకు చేర్చగా, వాటిని మర ఆడించి బియ్యం తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది.
ఇక భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 36 రైస్ మిల్లులకు గానూ మొదటి దశలో ఐదు మిల్లులకు ధాన్యం మిల్లింగ్ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మొదటి దశలో 5వేల టన్నుల సన్న వడ్లను మిల్లింగ్ చేసేందుకు పర్మిషన్ ఇస్తున్నట్టు సివిల్ సప్లై ఆఫీసర్లు పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఏ మిల్లు కూడా డీఫాల్టర్ల జాబితాలో లేదు.
ఎక్కడ.. ఎన్ని కొనుగోళ్లు?
ఖమ్మం జిల్లాలో ఈ సీజన్ లో 334 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో 143, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో 160, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 28, మెప్తా ఆధ్వర్యంలో 3 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. వీటి ద్వారా 13,787 రైతుల నుంచి 92,172 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ సీజన్ లో మొత్తం 4 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, ముందుగానే కొందరు రైతులు ప్రైవేట్ లో పచ్చి వడ్లనే అమ్ముకోవడంతో లక్ష్యాన్ని చేరుకోవడం కష్టంగా కనిపిస్తోంది. సీజన్ ముగిసే లోగా మరో లక్ష టన్నులను సేకరించే అవకాశం కనిపిస్తోంది.
Also Read :- యువ వికాసం గ్రాండ్ సక్సెస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించి1.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు సన్న వడ్లకు సంబంధించి 1.92లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 93,451 క్వింటాళ్లకు చెందిన బోనస్ రూ. 4.67కోట్లను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం వేసింది. మరో రూ. 4.91 కోట్ల మేర రైతుల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది.
స్టూడెంట్స్‌కు సన్న బియ్యం సప్లైపై సర్కారు దృష్టి
గవర్నమెంట్ హాస్టల్స్, మిడ్ డే మీల్స్, అంగన్వాడీ సెంటర్లు, గురుకులాలకు సన్న బియ్యం సప్లై చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం ఇందుకుగానూ అవసరమైన చర్యలు చేపట్టింది. వానాకాలం సీజన్‌కు సంబంధించి కొనుగోలు చేస్తున్న ధాన్యంలో సన్న వడ్లను బాయిల్డ్ రైస్ మిల్లులకు ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది.