మాగనూర్‌‌‌‌ స్కూల్‌‌‌‌ మధ్యాహ్న భోజనంలో పురుగులు

  • ఆఫీసర్ల పర్యవేక్షణలో వంట చేసిన సిబ్బంది
  • పురుగులు కనిపించడంతో ఆందోళనకు దిగిన స్టూడెంట్లు
  • డీఈవో సస్పెన్షన్‌‌‌‌, ఆర్డీవో, ఎంపీడీవో, ఫుడ్‌‌‌‌ సేఫ్టీ ఆఫీసర్‌‌‌‌కు షోకాజ్‌‌‌‌ నోటీసులు

మాగనూర్, వెలుగు : నారాయణపేట జిల్లా మాగనూర్‌‌‌‌ జడ్పీ హైస్కూల్‌‌‌‌లో బుధవారం ఫుడ్‌‌‌‌ పాయిజన్‌‌‌‌ జరగడంతో స్టూడెంట్లు ఇప్పటికే ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకుంటున్నారు. ఈ ఘటన జరిగిన తెల్లారే మళ్లీ స్టూడెంట్లకు పురుగుల అన్నం వడ్డించారు. వివరాల్లోకి వెళ్తే... మాగనూర్‌‌‌‌ స్కూల్‌‌‌‌లో ఫుడ్‌‌‌‌ పాయిజన్‌‌‌‌ జరగడంతో కలెక్టర్‌‌‌‌ సిక్తాపట్నాయక్‌‌‌‌ గురువారం ఉదయం స్కూల్‌‌‌‌ను పరిశీలించారు. టీచర్లు, స్టూడెంట్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వంటగదిని, బియ్యాన్ని తనిఖీ చేశారు. జిల్లా ఆఫీసర్ల పర్యవేక్షణలో, హాస్టల్‌‌‌‌ సిబ్బందితో మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేయాలని ఆదేశించి వెళ్లిపోయారు. 

దీంతో ఆర్డీవో రాంచందర్‌‌‌‌, డీఈవో అబ్దుల్‌‌‌‌ ఘనీ, ఎంపీడీవో రహమదుద్దీన్‌‌‌‌, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్‌‌‌‌ నీలిమ పర్యవేక్షణలో మధ్యాహ్న భోజనం వండించారు. అయితే ఈ అన్నంలో కూడా పురుగులు కనిపించడంతో స్టూడెంట్లు భోజనం చేయకుండా ఆందోళనకు దిగారు. దీంతో ఆఫీసర్లు ప్రైవేట్‌‌‌‌గా బియ్యం తెప్పించి సాయంత్రం నాలుగు గంటలకు స్టూడెంట్లకు భోజనం పెట్టారు. అనంతరం ఇంటికి వెళ్లే క్రమంలో స్టూడెంట్లు.. టీచర్ల సస్పెన్షన్‌‌‌‌ ఎత్తివేయాలంటూ ఆందోళనకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకొని స్కూల్‌‌‌‌ ఆవరణలో కూర్చొని డిమాండ్లు ఏమిటో చెప్పాలని కోరడంతో తిరిగి స్కూల్‌‌‌‌కు వచ్చారు. అయితే టీచర్ల ప్రోద్భలంతోనే ఆందోళన చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో ఓ టీచర్‌‌‌‌ స్టూడెంట్లకు నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించి వెళ్లిపోయారు.

డీఈవో సస్పెన్షన్‌‌‌‌, ముగ్గురికి నోటీసులు

మాగనూరు స్కూల్‌లో ఆర్డీవో, డీఈవో, ఎంపీడీవో, పుడ్‌ సేఫ్టీ ఆఫీసర్ల సమక్షంలో గురువారం వండిన అన్నంలో కూడా పురుగులు కనిపించడంతో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. డీఈవో అబ్దుల్‌ ఘనీని సస్పెండ్‌ చేయడంతో పాటు  ఆర్డీవో, ఎంపీడీవో, ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌కు కలెక్టర్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారని అడిషనల్ కలెక్టర్ బెన్‌ శాలం చెప్పారు. ఘటనపై పూర్తి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.