బంగాళాఖాతంలో ఏర్పడి వాయుగుండం తీవ్ర తుఫాన్ గా మారింది. దీనికి 'మిచాంగ్'గా వాతావరణ శాఖ నామకరణం చేసింది. ఈ 'మిచాంగ్' తుఫాన్ .. నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటుతుందని.. ఈ సమయంలో 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో ఎపిలోని కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం కోస్తా, రాయలసీమలోని జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది.
ఈ క్రమంలో సీఎం జగన్, అధికారులతో తుఫాన్ ప్రభావంపై సమీక్షించారు. ప్రజలను అప్రమత్తం చేయాలని.. లోతట్టు ప్రాంతాలను ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రెండు రోజులపాటు సముద్రంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు జాలర్లను హెచ్చరించారు. వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే శ్రీకాళహస్తి, తిరుపతిలో గడచిన 24 గంటల్లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.
బంగాళాఖాతంలో తుఫాను డిసెంబర్ 4న తీరాన్ని తాకే అవకాశం ఉన్నందున దక్షిణ మధ్య రైల్వే 142 రైళ్లను రద్దు చేసింది. ముందుజాగ్రత్త చర్యగా రానున్న 3-, 4 రోజుల పాటు రైళ్లను అధికారులు రద్దు చేశారు. 'మిచాంగ్' తుపాను డిసెంబర్ 4వ తేదీన నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి, కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో రానున్న మూడు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రద్దు చేసిన రైళ్లలో దానాపూర్-SMVT బెంగళూరు, బరౌని-కోయంబత్తూరు, KSR బెంగళూరు-దానాపూర్, నర్సాపూర్-కొట్టాయం, సికింద్రాబాద్-కొల్లాం, MGR చెన్నై సెంట్రల్-విజయవాడ, హౌరా-SMVT బెంగళూరు, MGR చెన్నై సెంట్రల్-హెచ్, నిజాముద్దీన్, గయా-MGR చెన్నై సెంట్రల్, గౌహతి-SMVT బెంగళూరు, గోరఖ్‌పూర్--కొచువేలి, MGR చెన్నై సెంట్రల్-హైదరాబాద్, MGR చెన్నై సెంట్రల్-న్యూఢిల్లీ, త్రివేండ్రం--న్యూఢిల్లీ, మధురై-H, నిజాముద్దీన్, MGR చెన్నై సెంట్రల్-అహ్మదాబాద్, నాగర్‌కోయిల్-షాలిమార్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ గమ్యస్థానాల మధ్య కూడా అనేక రైళ్లు రద్దు చేయబడ్డాయి.