తమిళనాడు దివంగత సీఎంలు ఎంజీఆర్, జయలలితకు గుర్తుగా కట్టిన ఆలయంలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఫొటోలు కనిపించాయి. మోడీ నేతృత్వంలోని కేంద్రం దేశానికి ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు అందించిందని, అందుకే వాళ్ల ఫొటోలను ఏర్పాటు చేశామని తమిళనాడు రెవెన్యూ మంత్రి ఆర్‌బీ ఉదయకుమార్ తెలిపారు. జేపీ నడ్డా ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు మదురైలో ఎయిమ్స్ ఆస్పత్రి నిర్మాణం జరిగిందని, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మదురైకి చెందినవారని చెప్పారు. 1987 డిసెంబర్ 24న ఎంజీఆర్ కన్నుమూశారు. జయలలిత 2016 డిసెంబర్ 5న గుండెపోటుతో మరణించారు. ఆ నేతలకు గుర్తుగా మంత్రి కుమార్ పర్యవేక్షణలో తిరుమంగళం సమీపంలోని టీ కునథుర్ ప్రాంతంలో ఈ ఏడాది జనవరిలో ఆలయ నిర్మాణం జరిగింది. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఏఐఏడీఎంకేతో కలిసి బీజేపీ పోటీ చేస్తోంది.
