మీ కుటుంబ సభ్యుడిగా చెప్తున్నా.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.. ఎక్స్ లో చిరంజీవి

బంగాళాఖాతంలో వాయుగుండం బలపడటంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. రెండురోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. చాలా చోట్ల వాగులు ఉప్పొంగడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ లో ట్వీట్ చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉందని, పలు గ్రామాలు, జాతీయ రహదారులు నీటితో మునిగిపోయాయని,.. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు చిరంజీవి. మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే... అత్యవసరం అయితే తప్ప ఎవరు ఇంటి నుంచి బయటకు రావద్దని అన్నారు.

వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉండటం వల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు, బాధితులకు మా అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వస్తున్నారని, ఇప్పుడూ అభిమానులంతా అండగా ఉంటారని ఆశిస్తున్నానని అంటూ ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.