మెడికల్‌‌ టూరిజం వైపు అపోలో

మెడికల్‌‌ టూరిజం వైపు అపోలో

భవిష్యత్‌‌లో ఎదుగుదలకు మెడికల్‌‌ టూరిజంపై దృష్టి పెట్టాలని అపోలో హాస్పిటల్స్‌‌ ఎంటర్‌‌ప్రైజ్‌‌ నిర్ణయించింది. ఈ విభాగం నుంచి ఆదాయం బాగా పెంచుకోవాలని ప్లాన్‌‌ చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకించి ఒక డివిజన్‌‌ ఏర్పాటు చేశామని, గత ఏడాది 2 లక్షల మంది పేషెంట్లకు చికిత్స అందించామని అపోలో హాస్పిటల్స్‌‌ జాయింట్‌‌ మేనేజింగ్‌‌ డైరెక్టర్‌‌ సంగీతా రెడ్డి చెప్పారు. మెడికల్‌‌ టూరిజం ఇండియాలో ఇంకా మొదటి దశలోనే ఉందని, కానీ భవిష్యత్‌‌ ఆశాజనకంగా కనిపిస్తోందని తెలిపారు. ఆంకాలజీ, ఆర్గాన్‌‌ ట్రాన్స్‌‌ప్లాంట్‌‌, కార్డియాక్‌‌ ప్రొసీజర్స్‌‌, ఆర్థోపెడిక్స్‌‌, న్యూరోసర్జరీ వంటి వాటి కోసమే విదేశీయులు ఇక్కడకు వస్తున్నట్లు వెల్లడించారు. పసిఫిక్‌‌ ఐలాండ్స్‌‌, ఆఫ్ఘనిస్తాన్‌‌, బంగ్లాదేశ్‌‌, ఇరాక్‌‌, కెన్యా, నైజీరియా, ఇథియోపియా, ఒమన్‌‌, యెమన్‌‌, శ్రీలంక, ఉజ్బెకిస్థాన్‌‌, మయన్మార్‌‌, నేపాల్‌‌ దేశాల నుంచి పేషెంట్లు తమ హాస్పిటల్‌‌కు వస్తున్నారని సంగీతా రెడ్డి చెప్పారు. మెడికల్‌‌ టూరిజం ఇండియా ఆర్థిక వ్యవస్థకు బాగా దోహదపడగలదనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ రంగం ఎక్కువ ఫారిన్‌‌ ఎక్స్చేంజ్‌‌ను తెచ్చిపెట్టగలిగేదిగా నీతి ఆయోగ్‌‌ గుర్తించిందని అన్నారు. చికిత్సకు తక్కువ వ్యయం, అడ్వాన్స్డ్‌‌ మెడికల్‌‌ టెక్నాలజీ, స్కిల్డ్‌‌ మెడికల్‌‌ ప్రొఫెషనల్స్‌‌ వంటి సానుకూల అంశాలే మన దేశానికి విదేశీయులను రప్పిస్తున్నట్లు వివరించారు. వీసా రూల్స్‌‌ను ప్రభుత్వం ఇప్పటికే సులభం చేసిందని, కాకపోతే మెడికల్‌‌ ట్రావెలర్స్‌‌ ఫైనాన్షియల్‌‌ ట్రాన్సాక్షన్స్‌‌ రూల్స్‌‌ను కూడా కొంత సులభం చేస్తే బాగుంటుందని సంగీతా రెడ్డి సూచించారు. ఇండియాలోకి వచ్చిన వెంటనే వీసా ఇచ్చేలా రూల్స్‌‌ ఉంటే మరింత మెరుగ్గా వుంటుందని చెప్పారు.