ఎంతకు తెగించార్రా..! మెడికల్‌‌ ఆఫీసర్ల సంతకాలు ఫోర్జరీ... ఇద్దరు అరెస్ట్‌‌

ఎంతకు తెగించార్రా..!   మెడికల్‌‌ ఆఫీసర్ల సంతకాలు ఫోర్జరీ... ఇద్దరు అరెస్ట్‌‌

సంస్థాన్‌‌నారాయణపురం, వెలుగు : ప్రభుత్వ డాక్టర్ల సంతకాలు ఫోర్జరీ చేసిన కేసులో ఇద్దరు మీ–సేవ నిర్వాహకులను పోలీసులు అరెస్ట్‌‌ చేసి రిమాండ్‌‌కు తరలించారు. ఈ ఘటన యాదాద్రి జిల్లా సంస్థాన్‌‌నారాయణపురంలో వెలుగుచూసింది. ఎస్సై జగన్‌‌ తెలిపిన వివరాల ప్రకారం.. సంస్థాన్‌‌ నారాయణపురానికి చెందిన గువ్వల సందీప్‌‌ స్థానికంగా మీ–సేవ నిర్వహిస్తుండగా.. చిల్లాపురం గ్రామానికి చెందిన మెరుగు శేఖర్‌‌ ఆపరేటర్‌‌గా పనిచేస్తున్నాడు. 

వీరిద్దరూ కలిసి నారాయణపురం మండల మెడికల్‌‌ ఆఫీసర్లు జోష్ణాదేవి, రవీనా సంతకాలను ఫోర్జరీ చేయడంతో పాటు వారి పేరున నకిలీ స్టాంపులు తయారు చేయించారు. తర్వాత ప్రజల నుంచి డబ్బులు తీసుకొని ఆఫీసర్ల పేరుతో సంతకాలు చేసి, స్టాంపులు వేసి ఇచ్చేవారు. ఈ విషయం మెడికల్‌‌ ఆఫీసర్‌‌ జోష్ణాదేవి దృష్టికి రావడంతో ఆమె స్థానిక తహసీల్దార్‌‌కు, పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి సందీప్‌‌, శేఖర్‌‌ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌‌కు తరలించినట్లు ఎస్సై జగన్‌‌ తెలిపారు.