నిర్మల్ జిల్లాలో విస్తరిస్తున్న ఫైలేరియా

  • గోదావరి పరివాహక ప్రాంతాల్లో నైట్ బ్లడ్ సర్వే
  • నిర్మల్ జిల్లాలో 18 గ్రామాల ఎంపిక 
  • రాత్రి పది నుంచి ఇంటింటికి వెళ్లిన వైద్య సిబ్బంది
  • మూడు రోజుల్లోగా బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్ లు

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలోని గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో  ఫైలేరియా వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది.  ఇప్పటివరకు జిల్లాలో 1474 ఫైలేరియా కేసులు నమోదైనట్లు గుర్తించి మరింతగా విస్తరించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని యాక్షన్ ప్లాన్ రూపొందించింది.  దీనికనుగుణంగా ఫైలేరియా తీవ్రత ఉన్న ప్రాంతాల్లో మైక్రో ఫైలేరియా నైట్ బ్లడ్ సర్వే పేరిట స్థానికులందరి నుంచి బ్లడ్ శాంపిళ్లను సేకరించాలని  నిర్ణయించింది.  

గురువారం రాత్రి పది గంటల నుంచి గుర్తించిన ప్రాంతాల్లో  వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికి తిరిగి స్థానికుల బ్లడ్ శాంపిళ్లను సేకరించింది. ఈ రక్త నమూనాలను శుక్రవారం ఆయా పీహెచ్‌సీ ల్యాబ్ లలో పరీక్షించారు.  వారం రోజుల్లో ఏ గ్రామంలో ఎంతమంది రక్తంలో ఫైలేరియా కణాలున్నాయనే అంశాన్ని వెలుగులోకి తేనున్నారు.  

Also Read :- బీఆర్​ఎస్​ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డికి ఈడీ సమన్లు

దీని ఆధారంగా వారందరికీ ముందస్తు చికిత్సలు అందించి వారి శరీరంలో ఫైలేరియా క్రిములు విస్తరించకుండా అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నారు.  ఈ ప్రక్రియను వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని వెక్టార్ బార్న్ డీసీజెస్ విభాగం పర్యవేక్షించనుంది.  ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ మైక్రో ఫైలేరియా నైట్ బ్లడ్ సర్వే కొనసాగుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 35 వేల నుంచి 40,000  మంది వరకు ఫైలేరియా బాధితులున్నట్లు అధికారులు చెబుతున్నారు.

జిల్లాలోని 18 ప్రాంతాల్లో రాత్రి సర్వే..

 జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న 18 గ్రామాలను ఫైలేరియా ఎఫెక్టెడ్ గ్రామాలుగా అధికారులు గుర్తించారు.  నిర్మల్ జిల్లా కేంద్రంలోని రాంనగర్, మంజులాపూర్ లతోపాటు ఖానాపూర్ పట్టణంలోని సుభాష్ నగర్, కనకాపూర్, దిమ్మదుర్తి, కొరటికల్, చింతలపేట, కుంటాల, దిలావర్పూర్, గడ్ చందా, తిమ్మాపూర్, లింగాపూర్, బూత్కూర్, దేగామ, ఎడ్బిడ్ గ్రామాలలో  భైంసా పట్టణంలోని సిద్ధార్థ నగర్, కుబీర్, చోండి, బోసి గ్రామాల్లో  రాత్రి బ్లడ్ శాంపిల్స్ ను సేకరించింది.  20 ఏళ్లు దాటిన వారిలో మాత్రమే ఫైలేరియా లక్షణాలు తెలుస్తాయి. ఈ కారణంగా ఆ వయస్సు పైబడిన వారి బ్లడ్ శాంపిల్స్ ను  సేకరించారు.  ఓ వ్యక్తి శరీరంలో ఫైలేరియా క్రిములుంటే అవి రాత్రి 10 గంటల తర్వాతనే సేకరించే బ్లడ్ శాంపిల్స్ లోనే గుర్తించే వీలుంటుంది.

ఫైలేరియా విస్తరణకు అడ్డుకట్ట వేసేందుకే నైట్ బ్లడ్ సర్వే...

నిర్మల్ జిల్లాలో ఫైలేరియా కేసులు విస్తరిస్తున్నాయి.    రాబోయే రోజుల్లో ఫైలేరియా వ్యాధి విస్తరించకుండా  చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగానే 18 గ్రామాలను ఎఫెక్టెడ్ గా గుర్తించాం.  ఈ గ్రామాల్లో మైక్రో ఫైలేరియా నైట్ బ్లడ్ సర్వ్ పేరిట ఇంటింటి సర్వే చేపట్టాం. బ్లడ్ శాంపిల్స్ అనంతరం ఫైలేరియా క్రిములున్న వారిని గుర్తించి వారందరికీ ట్రీట్మెంట్ అందిస్తాం.  

వీరికి డీఈసీ మాత్రలను సంవత్సరం పాటు అందించి వారిలో ఫైలేరియా క్రిములను నివారించేందుకు చర్యలు చేపడతాం. మలేరియా వ్యాధిపై గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించేందుకు కూడా చర్యలు తీసుకుంటాం.

డాక్టర్ రవీందర్ రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్, మలేరియా అండ్ ఫైలేరియా విభాగం, డీఎంఅండ్ హెచ్ ఓ ఆఫీస్,  నిర్మల్