12-14 శాతం గ్రోత్రేటుకు ఛాన్స్
చివరి క్వార్టర్లో జనరల్ ఎలక్షన్ల యాడ్ రెవెన్యూ
సినిమా థియేటర్ల కలెక్షన్లు వచ్చే ఏడాది పుంజుకుంటాయ్
క్రిసిల్ రిపోర్టు వెల్లడి
న్యూఢిల్లీ : ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మీడియా, ఎంటర్టెయిన్మెంట్ ఇండస్ట్రీ రెవెన్యూ రూ. 1.60 లక్షల కోట్లకు చేరుతుందని రేటింగ్ ఏజన్సీ క్రిసిల్ ఒక రిపోర్టులో వెల్లడించింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఈ రెవెన్యూ 12 నుంచి 14 శాతం గ్రోత్ సాధిస్తుందని పేర్కొంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ అడ్వర్టైజింగ్ రెవెన్యూ భారీగా పెరుగుతున్నదని, ఆ తర్వాత ప్లేస్‌లలో టీవీ, ప్రింట్ మీడియా ఉంటాయని కూడా క్రిసిల్ ఈ రిపోర్టులో తెలిపింది. మీడియా, ఎంటర్టెయిన్మెంట్ సెక్టార్ మొత్తం రెవెన్యూలో అడ్వర్టైజింగ్ రెవెన్యూ వాటా 55 శాతం దాకా ఉంటుందని వివరించింది. దేశంలో ఎకనమిక్ యాక్టివిటీ ఊపందుకోవడంతో ఈ రెవెన్యూ 14 శాతం పెరిగే ఛాన్స్ ఉందని వెల్లడించింది. వచ్చే ఏడాది దేశంలో జనరల్ ఎలక్షన్లు జరగనున్న నేపథ్యంలో అడ్వర్టైజింగ్ రెవెన్యూ ఈ ఫైనాన్షియల్ చివరి క్వార్టర్లో ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని క్రిసిల్ పేర్కొంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో సబ్స్క్రిప్షన్ రెవెన్యూ శాతం మాత్రమే పెరుగుతుందని, మొత్తం రెవెన్యూలో సబ్స్క్రిప్షన్ రెవెన్యూ వాటా 45 శాతమని వివరించింది. అడ్వర్టైజింగ్ రెవెన్యూలో ఎక్కువ వాటా టెలివిజన్ మీడియానే దక్కించుకుంటోందని, డిజిటల్ కూడా జోరందుకుంటోందని క్రిసిల్ రేటింగ్ డైరెక్టర్ నవీన్ వైద్యనాథన్ చెప్పారు. గత కొన్నేళ్లలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ఊపందుకున్నాయని, ఈ ప్లాట్‌ఫామ్స్ రెవెన్యూ 15 నుంచి 18 శాతం దాకా ఎగిసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి తర్వాత అడ్వర్టైజింగ్ రెవెన్యూలో డిజిటల్ సెకండ్ ప్లేస్‌లోకి చేరింది.
టెలివిజన్ మీడియా మొదటి ప్లేస్‌లో కొనసాగుతోంది. ఈ రెండూ కలిపి మొత్తం అడ్వర్టైజింగ్ రెవెన్యూలో మూడొంతులు దక్కించుకుంటున్నాయని వైద్యనాథన్ వెల్లడించారు. ఇక ప్రింట్ మీడియా అయిదో వంతు వాటాను దక్కించుకోగలుగుతోందని వివరించారు. వచ్చే ఫైనాన్షియల్ ఇయర్లో ప్రింట్ మీడియా కూడా అడ్వర్టైజింగ్రెవెన్యూలో మెరుగైన గ్రోత్ సాధించనుందని, ఇది 15 శాతం దాకా ఉంటుందని పేర్కొన్నారు. ప్రింట్ మీడియా రెవెన్యూ మాత్రం కరోనా ముందు లెవెల్స్‌తో పోలిస్తే తక్కువే ఉంటుందని క్రిసిల్ రిపోర్టు వెల్లడించింది. రేడియో, అవుట్డోర్ మీడియాలు మాత్రం వచ్చే ఏడాది కరోనా ముందు లెవెల్స్‌ను అందుకునే సంకేతాలున్నాయని పేర్కొంది. కరోనా టైములో బాగా దెబ్బతిన్న సినిమా థియేటర్ల కలెక్షన్లు (నాన్ యాడ్ రెవెన్యూ) 2024లో ఏకంగా 30 శాతం పెరిగే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించింది. ఆక్యుపెన్సీ జోరందుకోవడంతోపాటు, కొత్త స్క్రీన్ల ఏర్పాటు కూడా ఇందుకు కారణమని తెలిపింది.
