జర్నలిస్టులు ప్రజల పక్షాన నిలబడాలి

  • పీఐబీ మీడియా వర్క్​షాప్​లో మెదక్ ఎంపీ రఘునందన్​రావు

మెదక్, వెలుగు: జర్నలిస్టులు ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడాలని మెదక్ ఎంపీ రఘునందన్​రావు​పేర్కొన్నారు. ప్రెస్​బ్యూరో ఆఫ్​ఇన్ఫర్మేషన్ (పీఐబీ) ఆధ్వర్యంలో  శుక్రవారం మెదక్​ కలెక్టరేట్​లో  ‘వార్త లాప్​’ పేరుతో  మీడియా వర్క్​ షాప్​నిర్వహించారు. దీనికి  చీఫ్​గెస్ట్​గా హాజరైన ఎంపీ మాట్లాడుతూ..  జర్నలిస్టులు పేదలకు మేలు చేసే వార్తలు, కథనాలు రాయాలని సూచించారు. జర్నలిస్టులు ఎప్పుడూ అద్దంలా ఉండాలని, విలువలు పెంపొందించుకోవాలని, వాస్తవాలు మాత్రమే రాయాలని అభిప్రాయపడ్డారు.  విలువలతో కూడిన జర్నలిజం సమాజానికి మేలు చేస్తుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా చూడాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందని తెలిపారు.  తాను కూడా గతంలో జర్నలిస్టుగా పనిచేసిన విషయాన్ని రఘునందన్ రావు​ గుర్తు చేశారు.  

జర్నలిజం చాలా పవిత్రమైందని, నిజమైన వార్తలు ప్రచురించాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా వార్తలు రాసి  ప్రజలను చైతన్య పరచాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. డిజిటల్​యుగంలో పరిశోధన జర్నలిజం అంశంపై  టైమ్స్​ఆఫ్​ ఇండియా ఇన్వెస్టిగేటివ్​ఎడిటర్​సుధాకర్​రెడ్డి అవగాహన కల్పించారు. జర్నలిస్టుల ఆలోచన, మాట, రాతలో స్పష్టత ఉండాలని సూచించారు.  వాట్సప్​, ఫేస్​బుక్​ వంటి సోషల్​ మీడియాలో వచ్చే వాటిని గుడ్డిగా నమ్మి వార్తలు రాయొద్దని సూచించారు. సీ డాక్​ సీనియర్​ప్రాజెక్ట్​ ఇంజనీర్​ రామకృష్టయ్య, సైబర్​సెక్యూరిటీపై పవర్​ పాయింట్​ప్రజెంటేషన్​ద్వారా అవగాహన కల్పించారు.