పండగకు ఊరెళ్లే వాళ్లు జాగ్రత్తగా ఉండాలి : ఎస్పీ ఉదయ్​ కుమార్​ రెడ్డి

  • మెదక్​ జిల్లా ఎస్పీ ఉదయ్​ కుమార్​ రెడ్డి

మెదక్​ టౌన్​, వెలుగు : దసరా పండగకు తమ ఊర్లకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని ముందస్తుగా పోలీసులకు సమాచారం అందించినట్లయితే తమ సిబ్బంది సెక్యూరిటీ పరంగా అవసరమైన చర్యలు తీసుకుంటారని మెదక్​ జిల్లా ఎస్పీ ఉదయ్​ కుమార్​రెడ్డి తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో మాట్లాడుతూ... పండగకు ఊర్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం కానీ, వెంట తీసుకెళ్లాలని చెప్పారు. 

పక్కింటి వారికి ఇంటి పరిసరాలను గమనించాలని చెప్పాలని పోలీసులకు సమాచారం అందిస్తే తమ సిబ్బంది పరిశీలిస్తారన్నారు.  ప్రజలు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్ అధికారి ఫోన్ నెంబర్ ఇతర అధికారుల నెంబర్లు సెల్ ఫోన్లలో ఫీడ్​ చేసుకోవాల్సిందిగా కోరారు.  అనుమానాస్పదంగా కొత్త వారు వీధుల్లో తిరిగితే 100 డయల్, సంబంధిత పోలీస్ అధికారులకు సమాచారం అందించాలన్నారు.  ప్రజలు పోలీసులతో సహకరిస్తే చోరీలను నియంత్రించవచ్చని పండగను ముందస్తు జాగ్రత్తలతో అవాంఛనీయమైన సంఘటనలు లేకుండా జరుపుకోవాలని ఎస్పీ ఉదయ్​ కుమార్​ రెడ్డి ఆకాంక్షించారు. 

పోలీస్​ యాక్ట్ అమలు

 మెదక్​ జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా ఈనెల అక్టోబర్ 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్​ యాక్ట్ అమలులో ఉంటుందని మెదక్​ జిల్లా ఎస్పీ ఉదయ్​ కుమార్​ రెడ్డి తెలిపారు. మంగళవారం ఎస్పీ తన కార్యాలయంలో మాట్లాడుతూ.. నెలరోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 30,30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని పేర్కొన్నారు. 

పోలీసుల అనుమతి లేకుండా జిల్లా ప్రజలు ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్​ మీటింగ్​లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. ఈ విషయంలో జిల్లా ప్రజలు,  ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని ఎస్పీ ఉదయ్​ కుమార్​రెడ్డి  కోరారు.