మెదక్ జిల్లా నెట్వర్క్, వెలుగు: వివిధ కారణాలతో మెదక్ జిల్లాలో బుధవారం ఒకే రోజు తొమ్మిది మంది మృతి చెందారు. కొందరు రోడ్డు ప్రమాదాల్లో చనిపోగా, మరికొందరు ఆత్మహత్య చేసుకున్నారు. రామాయంపేట నేషనల్హైవే మీద ఆగి ఉన్న లారీని బుధవారం తెల్లవారు జామున ఆటో ఢీకొంది. ఆటో నడిపిస్తున్న నర్సాపూర్ మండలం చిన్న చింతకుంటకు చెందిన నరేశ్ గౌడ్ (35) తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.
హవేలిఘనపూర్ మండలం ఫరీద్ పూర్ శివారులో మెదక్ - ఎల్లారెడ్డి మెయిన్ రోడ్డు మీద ఆటో - బైక్ ఢీకొన్న ప్రమాదంలో మక్త భూపతిపూర్ గ్రామానికి చెందిన కర్రోల మల్లేశం చనిపోయాడు. హవేలి ఘనపూర్ మండలం కాప్రాయిపల్లిలో కరెంట్ షాక్ తగిలి కుక్కలరాజు(30) అనే రైతు మృతి చెందాడు. సుల్తాన్ పూర్ కు చెందిన అరిగె గోపాల్ (45) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయాడు. శివ్వంపేట మండలం శభాష్ పల్లి గ్రామానికి చెందిన పడిగే బాబు(35) భార్యతో గొడవ పడి పిల్లిగుండ్ల మత్తడి చెక్ డ్యాంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఫైర్ సిబ్బంది మత్తడిలో గాలింపు చేపట్టి డెడ్ బాడీని వెలికి తీశారు. తూప్రాన్ మండలం ఘనపూర్ కు గ్రామానికి చెందిన వంశీ (20) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిన్నశంకరంపేట మండలం శాలిపేట గ్రామానికి చెందిన బుస్స రమేశ్ (45) చేపల వేటకు వెళ్లి మృతి చెందాడు. పెద్దశంకరంపేట మండల పరిధి తిరుమలాపూర్ చెరువులో కౌసల్ శ్రీనివాస్ (58) శవమై తేలాడు. అల్లాదుర్గం మండలం చేవెళ్లలో నీటి కుంటలో మునిగి గ్రామానికి చెందిన చెన్న శివకుమార్ (32) చనిపోయారు.