కాంగ్రెస్ సీఎంలను బర్తరఫ్ చేయండి

  • అమెరికాలో అదానీపై కేసుకు మోదీకి ఏం సంబంధం
  • రాహుల్ గాంధీకి చట్టాలపై అవగాహన లేదు 
  • మెదక్ ఎంపీ రఘునందన్ రావు 

జహీరాబాద్, వెలుగు: అదానితో వ్యాపార ఒప్పందం చేసుకున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులను బర్తరఫ్ చేయాలని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. శుక్రవారం జహీరాబాద్ లోని నాగదేవత ఆలయం, బర్దిపూర్ ఆశ్రమంలో పూజలు నిర్వహించిన తర్వాత అయ్యప్ప స్వామి దేవాలయంలో మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఎంపీ మాట్లాడారు. అదానీ విషయంలో రాహుల్ గాంధీ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. 

అమెరికాలో అదానిపై కేసు నమోదైతే ఇండియాలో ప్రధాని మోదీకి ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు. అదాని పెట్టుబడులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటే తప్పు లేదా.. ఆయనపై ఏం చర్యలు తీసుకుంటారో రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పూర్తిగా నాశనమవుతుందని దీనికి కారణం రాహుల్ అబద్ధాల ప్రచారాలేనన్నారు. వక్ఫ్ సవరణ చట్టం బిల్లు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదం పొందుతుందన్నారు. 

భవిష్యత్ రోజుల్లో ఒకే చట్టం, ఒకే దేశం వస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్ లో మాజీ ఎంపీ బీబీ పటేల్, బీజేపీ రాష్ట్ర నేతలు ఎం. జైపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, నేతలు తదితరులు పాల్గొన్నారు.