- స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
- పాశమైలారంలో ట్రీట్‌మెంట్ ప్లాంట్ ప్రారంభం
పటాన్‌చెరు, వెలుగు : కాలుష్య నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చెప్పారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో నిర్మించిన కాలుష్య జలాల శుద్ధి కర్మాగారం (సీసీఈటీపీ)ను శనివారం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ కాలుష్య నియత్రణలో భాగంగా రూ. 104.24 కోట్లతో ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.
కంపెనీల నుంచి వెలువడుతున్న కాలుష్య జలాలు శుద్ధి చేసేందుకు ఈ ప్లాంట్ ద్వారా వీలుంటుందన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ మైనింగ్, పారిశ్రామిక రంగం వల్ల రోజురోజుకు కాలుష్యం పెరిగిపోతోందన్నారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ కంపెనీల్లో కార్మికులను కాపాడుకోవాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్‌ఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, కలెక్టర్ వల్లూరి క్రాంతి పాల్గొన్నారు.
