Vijay Hazare Trophy: 10 మంది ఫీల్డర్లతో ఆడలేం: పృథ్వీ షాను ఘోరంగా అవమానించిన ముంబై క్రికెట్

విజయ్ హజారే వన్డే ట్రోఫీలో పాల్గొనే ముంబై జట్టులో చోటు దక్కకపోవడంపై టీమిండియాకు దూరమైన ఓపెనర్ పృథ్వీ షా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దేవుడా ఇలాంటివి ఇంకెన్ని చూడాలి’ అంటూ సోషల్ మీడియా పోస్టులో తన నిర్వేదాన్ని వ్యక్తం చేశాడు. ఈ పోస్టులో తన లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–ఎ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గణాంకాలను ప్రస్తావించి తనను జట్టు నుంచి ఎందుకు తప్పించారని ప్రశ్నించారు. షా గురించి తాజాగా ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఆయన మాట్లాడుతూ " నేను మీకు ఒక విషయం చెబుతాను. షాకు ఎవరూ శత్రువులు కాదు. అతనికి అతనే సొంత శత్రువు. అతని ఫిట్‌నెస్ విషయానికొస్తే షా ఘోరంగా ఉన్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మేము 10 మంది ఫీల్డర్‌లతోనే ఆడాము. పృథ్వీ షాను మేము దాచవలసి వచ్చింది. బంతి అతని దగ్గరికి వెళ్తున్న అతను ఫీల్డింగ్ లో కదలలేకపోతున్నాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా అతను ఇబ్బంది పడుతున్నట్టు మేము గమనించాం. అతని ఫిట్‌నెస్, క్రమశిక్షణ మాకు అసంతృప్తిగా అనిపించింది". అని ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు తెలిపారు. 

నిజానికి పృథ్వీ షా క్రికెటర్‌‌‌‌‌‌‌‌గా ఎదిగిన తీరు స్ఫూర్తి దాయకం. 19 ఏండ్ల వయసులో ఓ మెరుపులా ఇండియా టీమ్‌‌‌‌లోకి వచ్చాడు. తన తొలి టెస్టులోనే సెంచరీతో ఔరా అనిపించాడు. అప్పటికే అండర్‌‌‌‌‌‌‌‌19 వరల్డ్ కప్‌‌‌‌లో కెప్టెన్‌‌‌‌గా ఇండియాను గెలిపించడం, రంజీల్లో సెంచరీల మోత మోగించడంతో పాటు అద్భుత ప్రతిభ ఉండటంతో షా ఎంతో ఎత్తుకు ఎదుగుతాడని అంతా అనుకున్నారు. 

2018లో తన తొలి రెండు టెస్టుల్లో  ఓ సెంచరీ, ఫిఫ్టీతో మెరిసిన పృథ్వీ 2020లో తర్వాతి మూడు టెస్టుల్లో నిరాశపరిచాడు. 2020–21లో ఆరు వన్డేలు ఆడినా ఒక్క ఫిఫ్టీ కూడా కొట్టలేకపోయాడు. దాంతో నేషనల్ టీమ్‌‌‌‌లో చోటు కోల్పోయిన షా మూడేండ్లయినా తిరిగి రాలేకపోయాడు. టన్నుల కొద్దీ టాలెంట్‌‌‌‌ ఉన్నా.. క్రమశిక్షణ లేకపోవడం వల్లనే  షా క్రికెట్ జీవితం ఇలా తలకిందులైందని చెప్పొచ్చు.