IND vs BAN T20I: 150 కి.మీ వేగం వచ్చేస్తుంది: ప్రాక్టీస్‌లో మయాంక్ యాదవ్ కసరత్తులు

బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ 2-0 తో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఇప్పుడు టీ20 సిరీస్ కు సిద్దమవుతుంది. ఆదివారం (అక్టోబర్ 6) గ్వాలియర్‌లో ఇరు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించేశారు. సీనియర్ ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వడంతో ఈ మ్యాచ్ లో భారత యువ క్రికెటర్లకు అవకాశం లభించనుంది. ముఖ్యంగా అందరి చూపు యువ ఫాస్ట్ బౌలర్ మయంక్ పైనే ఉంది. ఐపీఎల్ లో సంచలన బౌలింగ్ తో ఓవర్ నైట్ స్టార్ గా వెలిగి ఆ తర్వాత గాయం కారణంగా మళ్ళీ కనిపించలేదు. 

మయాంక్ పూర్తి ఫిట్ నెస్ సాధించడంతో బంగ్లాదేశ్ సిరీస్ కు ఎంపికయ్యాడు. తొలి టీ20 లో ఈ యువ బౌలర్ కు తుది జట్టులో చోటు ఖాయంగా కనిపిస్తుంది. మొదటి టీ20 కు ముందు మయాంక్ నెట్స్‌లో చెమటోడ్చాడు. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ సారధ్యంలో చాలా సేపు బౌలింగు వేస్తూ కనిపించాడు. వేగంతో పాటు ఖచ్చితత్వంతో బౌలింగ్ చేయగల మయాంక్ ఎలా బౌలింగ్ చేస్తాడనే ఆసక్తి అందరిలో నెలకొంది.             
 
ఐపీఎల్ లో అనూహ్యంగా దూసుకొచ్చి ట్రెండింగ్ లోకి వచ్చిన ఈ యువ 21 ఏళ్ళ యువ బౌలర్ తన బౌలింగ్ తో ఒక్కసారిగా ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకున్నాడు. పేస్ ఎవరైనా వేస్తారు.. కానీ మయాంక్ మాత్రం నిలకడగా 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతున్నాడు. బ్యాటర్ ఎవరైనా ఇతని బౌలింగ్ ధాటికి కుదేలవుతున్నాడు. ఆడిన రెండు మ్యాచ్ ల్లో 6 వికెట్లు పడగొట్టడమే కాదు.. పొదుపుగా బౌలింగ్ చేస్తూ సంచలనంగా మారాడు.

ఐపీఎల్ లో లక్నో సూపర్ జయింట్స్ తరపున మూడే మ్యాచ్ లాడి రెండు సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు.గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో గాయం కారణంగా మ్యాచ్ మధ్యలోనే వైదొలిగాడు. ఆ తర్వాత లక్నో ఆడిన మ్యాచ్ లకు దూరమయ్యాడు. ఈ క్రమంలో టీమిండియాలో చోటు దక్కిచుకోలేకపోయాడు.