ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్.. భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ప్రశంసల్లో ముంచెత్తాడు. తాను ఎదుర్కొన్న అత్యుత్తమ బౌలర్ బుమ్రానేనని ఈ ఆసీస్ స్టార్ వెల్లడించాడు. అంతేకాదు, బుమ్రాను ప్రపంచ అత్యుత్తమ ఆల్ ఫార్మాట్ బౌలర్‌గా కొనియాడాడు. బ్యాటర్లను ఇబ్బంది పెట్టడానికి అతని వద్ద ఎన్నో అస్త్రాలు ఉంటాయని చెప్పుకొచ్చిన మ్యాక్సీ.. పరిస్థితిని బట్టి వాటిని బయటకు తీస్తుంటాడని అన్నాడు.
ALSO READ : AUS vs IND: ఐదుగురు ఆసీస్ స్టార్ ఆటగాళ్లను భయపెడుతున్న భారత బ్యాటర్
''నేను ఎదుర్కొన్న బౌలర్లలో అత్యంత కఠినమైన బౌలర్ బుమ్రా. అతను అత్యుత్తమ ఆల్ ఫార్మాట్ బౌలర్. అతను బంతిని వదిలే స్థానం ఇతర బౌలర్లతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. అతను అనుకున్న ప్రదేశంలో బంతిని వేయగలడు.. చివరి నిమిషంలో బంతి గమ్యాన్ని మార్చగలడు. అతని బౌలింగ్ శైలి కూడా చాలా ప్రత్యేకం. ఆ స్లో బాల్స్, ఖచ్చితమైన యార్కర్లు.. బ్యాటర్లను ఎల్లప్పుడూ ఇబ్బంది పెట్టేవే. బుమ్రా ఎనర్జీ కూడా మరో లెవెల్. అలసిపోయినట్లు ఎప్పుడూ కనిపించడు. అతనిలో ఎంతో సామర్థ్యం దాగుంది.." అని మ్యాక్స్‌వెల్ చెప్పుకొచ్చాడు.
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నెం.1
ఆసీస్ ఆల్‌రౌండర్ మాటల్లో వాస్తవం లేకపోలేదు. బుమ్రా బంతిని రెండు విధాలుగా స్వింగ్ చేయగల సామర్థ్యం, ఖచ్చితత్వం అతన్ని అంతర్జాతీయ క్రికెట్‌లో బలమైన శక్తిగా మార్చాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. అతను జట్టులో ఉన్నాడంటే భారత బ్యాటింగ్ లైనప్ కంటే బౌలింగ్ బలంగా ఉన్నట్లు లెక్క. భారత క్రికెట్ జట్టుపై అతని ప్రభావం అలాంటిది. టెస్టు క్రికెట్‌లో భారత జట్టు విజయాలకు అతనే ప్రధాన కారణమన్నా సందేహించాల్సింది లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కూడా, బుమ్రా ఇప్పటికే తానేంటో నిరూపించాడు. ఐసీసీ టెస్ట్ బౌలర్స్ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు.
బుమ్రా 2016 జనవరిలో ఆస్ట్రేలియాపై భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 40 టెస్టుల్లో 173 వికెట్లు, 89 వన్డేల్లో 149, టీ20ల్లో 89 వికెట్లు పడగొట్టాడు. త్వరలో జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అతనిపై భారత్ ఆశలన్నీ. ఆసీస్ గడ్డపై బుమ్రా.. తన చివరి ఏడు టెస్టుల్లో 32 వికెట్లు పడగొట్టాడు.