IND vs AUS: ఆ యువ భారత క్రికెటర్ 40కి పైగా టెస్ట్ సెంచరీలు చేస్తాడు: మ్యాక్స్ వెల్

ప్రస్తుతం భారత టెస్ట్ క్రికెట్ లో సూపర్ ఫామ్ లో ఉన్న ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే ఓపెనర్ జైశ్వాల్ అని చెప్పుకోవాలి. ఏడాది కాలంగా జైశ్వాల్ భారత టెస్ట్ జట్టులో అత్యంత నిలకడగా రాణిస్తున్నాడు.ఈ క్రమంలో ఎన్నో రికార్డ్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. వెస్టిండీస్ పై తొలి టెస్ట్ లో సెంచరీ చేసి సత్తా చాటిన జైశ్వాల్.. ఆ తర్వాత ఇంగ్లాండ్ పై 5 టెస్టుల్లో ఏకంగా 712 పరుగులు చేసి సంచలనంగా మారాడు. ఇటీవలే ముగిసిన పెర్త్ టెస్టులోనూ ఈ యువ ఓపెనర్ భారీ సెంచరీతో సత్తా చాటాడు.

జైశ్వాల్ సూపర్ ఫామ్ పై ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ మ్యాక్స్ వెల్ ప్రశంసలు కురిపించాడు. మ్యాక్స్ వెల్ మాట్లాడుతూ జైస్వాల్ కెరీర్ ను ముందుగానే అంచనా వేశాడు. " జైశ్వాల్ భిన్నమైన ఆటగాడు. అతడు భవిష్యత్తులో చాలా రికార్డ్స్ బ్రేక్ చేస్తాడు. 40 కంటే ఎక్కువ టెస్టు సెంచరీలు సాధించిన వారిలో అతను నిలుస్తాడు. పరిస్థితులకు తగ్గట్టు ఆడే గొప్ప సామర్ధ్యమున్న వ్యక్తి". అని 'ది గ్రేడ్ క్రికెటర్' పోడ్‌కాస్ట్‌లో మాక్స్‌వెల్ చెప్పాడు. 

Also Read :  RCB జట్టు తీసుకోలేదని స్టార్ క్రికెటర్ భార్య ఎమోషనల్

పెర్త్‌ టెస్టులో జైశ్వాల్ సెంచరీ భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. కెరీర్ లో అతనికి ఇది నాలుగో సెంచరీ. నాలుగు సెంచరీలు కూడా 150 కి పైగా స్కోర్లు చేస్తూ భారీ సెంచరీలుగా మలిచాడు. ఇప్పటివరకు 15 టెస్టులాడిన జైశ్వాల్.. 58.07 సగటుతో 1,568 పరుగులు సాధించాడు. ప్రస్తుతం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.