తెలంగాణ- చత్తీస్​గఢ్ ​బార్డర్ లో మావోయిస్టు పార్టీ వార్షికోత్సవాలు

భద్రాచలం, వెలుగు: తెలంగాణ – చత్తీస్​గఢ్​ బార్డర్ లో మావోయిస్టు పార్టీ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తాజాగా బీజాపూర్​ జిల్లా కొండపల్లి ఏరియాలో పెద్ద ఎత్తున తరలివచ్చిన ఆదివాసీలతో ర్యాలీ నిర్వహించి, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అమరవీరులకు నివాళి అర్పిస్తూ .. వారు ఆలపించిన గీతాలు పలువురిని కంటతడి పెట్టించాయి. బేస్​ క్యాంపులతో నిత్యం కూంబింగ్​లు నిర్వహిస్తున్న  భద్రతా బలగాలను దాటుకుని ఆదివాసీలు సంబురాలకు తరలివెళ్లడం విశేషం. ఇటీవలే అబూజ్​మాడ్ ఏరియాలో జరిగిన ఎన్​కౌంటర్​లో 38 మంది మావోయిస్టులు చనిపోయినా, ఏ మాత్రం తమ కార్యకలాపాలను తగ్గించుకోకుండా  వార్షికోత్సవాలు జరుపుకోవడం గమనార్హం.   

ఆదివాసీ హక్కులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు హరిస్తున్నాయంటూ ర్యాలీల్లో నినాదాలు చేశారు. మాడ్​ను కాపాడుకోవాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.  గత నెల 21 నుంచి ఈనెల 20వ తేదీ వరకు మావోయిస్టు పార్టీ 20వ వార్షికోత్సవాల నిర్వహణకు మావోయిస్టులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కాగా.. దండకారణ్యంలో  జరిగిన భారీ ఎన్​కౌంటర్ లో 38 మంది మావోయిస్టులు మృతిచెందారని బస్తర్​ఐజీ సుందర్​ రాజ్​ పి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.  తొలుత 31 మంది చనిపోయినట్లుగా గుర్తించారు. కానీ గాయపడిన మరికొందరిలో 7 మంది కూడా మృతి చెందినట్లు, వారి పేర్లను కూడా బస్తర్​ పోలీసులు గుర్తించి వెల్లడించారు. వీరిపై రూ.2.62కోట్ల రివార్డు ఉన్నట్లు ఐజీ తెలిపారు.