సినీ ఫక్కీలో మొబైల్ ఫోన్ల లోడ్‌తో వెళుతున్న ఓ కంటైనర్‌ను అడ్డగించి అందులోని కోట్ల రూపాయలు విలువ చేసే ఫోన్లను ఎత్తుకుపోయారు కొందరు దుండగులు. ఈ సంఘటన మంగళవారం రాత్రి చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. తమిళనాడులోని శ్రీ పెరంబుర్ నుంచి ముంబైకి వెళ్తున్న మొబైల్ కంటైనర్‌ను ఆంధ్రా బోర్డర్లో ఫుల్ లోడుతో వెళ్తున్న లారీని మరో లారీతో అడ్డగించారు దుండగులు . అనంతరం డ్రైవర్‌ను చితకబాది అందులోని రూ.6 కోట్ల విలువైన సెల్ఫోన్లను దోచుకెళ్లారు. మొత్తం 16 బాక్సులు ఉండగా.. 8 బాక్సుల్లోని 7500 మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లారు. మొబైల్స్ ఉన్న లారీని పుత్తూరుకు తీసుకెళ్లి… అక్కడ మరో లారీలోకి మార్చుకుని పరారయ్యారు.లారీలో మొత్తం రూ.12 కోట్ల విలువ చేసే మొబైల్ ఫోన్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. సెల్ఫోన్లు అన్నీ షామీ కంపెనీవిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు
