జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ .. ఐదుగురు నక్సలైట్లు మృతి

జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ .. ఐదుగురు నక్సలైట్లు మృతి
  • మరో ఇద్దరు అరెస్ట్..పలు రైఫిళ్లు స్వాధీనం

రాంచీ: జార్ఖండ్‌లో  సోమవారం తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. సింగ్‌భూమ్ జిల్లా గువా పరిధిలోని లిపుంగా ఏరియాకు సమీపంలో  భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో ఓ మహిళా నక్సలైట్ కూడా ఉన్నారు. మరో ఇద్దరు మావోయిస్టులను అధికారులు అరెస్ట్ చేశారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశం నుంచి ఒక ఐఎన్ఎస్ఏ రైఫిల్, రెండు ఎస్ఎల్ఆర్ లు, మూడు రైఫిల్స్, ఒక పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. 

ఘటనపై జార్ఖండ్ పోలీసు అధికార ప్రతినిధి అండ్ ఐజీ అమోల్ హోంకర్ మాట్లాడారు. ‘‘చైబాసా పోలీసులు, కోబ్రా 209, జార్ఖండ్ జాగ్వార్, సీఆర్‌పీఎఫ్‌లతో కూడిన బలగాలు గువా పరిధిలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఉదయం 5 గంటలకు లిపుంగా ఏరియాకు చేరుకోగానే భద్రతా బృందంపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం బలగాలు కూడా ఎదురుకాల్పులకు దిగాయి. సుమారు గంటపాటు జరిగిన ఈ కాల్పుల్లో ఐదుగురు నక్సలైట్లు మృతిచెందారు. వారు  మావోయిస్టుల్లో జోనల్ కమాండర్, సబ్ జోనల్ కమాండర్, ఏరియా కమాండర్, ఆర్గనైజేషన్ కార్యకర్త ఉన్నారు.

 మృతులను కండె హోన్‌హగా, సింగ్రాయ్ అలియాస్ మనోజ్, సూర్య అలియాస్ ముండా దేవగం, మహిళా కేడర్ జుంగా పూర్తి అలియాస్ మార్లాగా గుర్తించాం. తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఏరియా కమాండర్ టైగర్ అలియాస్ పాండు హన్స్ డా, బత్రీ దేవగమ్‌ను అరెస్టు చేశాం. ఘటనాస్థలం నుంచి పలు రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నాం" అని వివరించారు.  రాష్ట్రంలో మావోయిస్టులకు కొల్హాన్, సర్ందా మాత్రమే కంచుకోటలుగా ఉన్నట్లు చెప్పింన హోంకర్..భద్రతా బలగాల నిరంతర ఆపరేషన్ల కారణంగా మావోయిస్టులు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యారని తెలిపారు.