జమ్మూ కాశ్మీర్‎లో భారీ ఎన్ కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్: తుపాకుల మోతతో మరోసారి జమ్మూ కాశ్మీర్ మరోసారి దద్దరిల్లింది. 2024, డిసెంబర్ 19వ తేదీ తెల్లవారుజూమున కాశ్మీర్‎లోని కుల్గాంలో జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, టెర్రరిస్టులకు మధ్య జరిగిన భీకర  కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతం కాగా.. మరో ఇద్దరు ఉగ్రమూకలను అదుపులోకి తీసుకున్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. బుధవారం (డిసెంబర్ 18) రాత్రి కుల్గాం జిల్లాలోని బెహిబాగ్ ప్రాంతంలోని కద్దర్‌లో ఉగ్రవాదులు నక్కిఉన్నట్లు భద్రతా దళాలకు ఇంటెల్ అందింది.

 దీంతో వెంటనే అప్రమత్తమైన జవాన్లు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఓ చోట భద్రతా దళాలకు తారపడ్డ ఉగ్రవాదులు.. జవాన్లపై విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డారు. వెంటనే ప్రతిస్పందించిన భద్రతా దళాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయి. దాదాపు నాలుగు ఐదు గంటల పాటు ఇరువర్గాల మధ్య భీకరంగా కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే జవాన్ల కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతం అయ్యారు. 

మరో ఇద్దరు టెర్రిరిస్టులను ప్రాణాలతో అదుపులోకి తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఘటన స్థలంలో ఎన్ కౌంటర్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. మృతి చెందిన టెర్రిరిస్టులు వివరాలు.. ఏ గ్రూప్‎కు చెందిన వారు అనే విషయం తెలియాల్సి ఉందన్నారు. 2024 నవంబర్‌లో కిష్త్వార్ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఉగ్రవాదుల కాల్పుల్లో జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్‎తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు వీరమరణం పొందారు. తాజాగా ఎన్ కౌంటర్లో మృతి చెందిన టెర్రరిస్టులకు కిష్త్వార్ ఎన్ కౌంటర్‎తో లింక్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.