ఎమ్మెల్సీ ఎన్నికలో.. భారీగా క్రాస్​ ఓటింగ్

320 మంది ప్రజాప్రతినిధులున్న కాంగ్రెస్​కు 652 ఓట్లు
కానుకలిచ్చినా.. హస్తం​ వైపే బీఆర్ఎస్ ప్రతినిధుల మొగ్గు
109 ఓట్లతో గట్టెక్కిన నవీన్ కుమార్​ రెడ్డి 

మహబూబ్​నగర్, వెలుగు: మహబూబ్​నగర్​ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో భారీగా క్రాస్​ ఓటింగ్​ జరిగింది. ఈ స్థానంలో బీఆర్ఎస్​కు పూర్తిస్థాయి మెజారిటీకి అవసరమైన సభ్యులున్నప్పటికీ.. గులాబీ పార్టీ నేతలు పెద్దఎత్తున క్యాంపులు పెట్టి, కానుకలు ఇచ్చారు. కానీ, చాలామంది కాంగ్రెస్​కే ఓటేశారు. దాదాపు వెయ్యి ఓట్ల సంఖ్యా బలం ఉన్న ఈ పార్టీకి 109 ఓట్ల మెజార్టీ రావడం చర్చనీయాంశంగా మారింది.

మహబూబ్​నగర్ ​స్థానిక సంస్థల​ ఎమ్మెల్సీ స్థానంలో ఎంపీటీసీలు 888, కౌన్సిలర్లు 449, జడ్పీటీసీలు 83, ఎక్స్​ ఆఫీషియోలు 19 మందిని కలుపుకొని మొత్తం 1,439 ఓటర్లు ఉన్నారు. ఇందులో దాదాపు వెయ్యి మంది బీఆర్ఎస్, 320 మంది కాంగ్రెస్, 119 మంది బీజేపీ, ఇతర ఇండిపెండెంట్​ ఓటర్లు ఉన్నట్టు సమాచారం. బై పోల్​లో 1,439 మంది ఓటర్లకు గాను 1,437 ఓట్లు పోలయ్యాయి. ఇద్దరు వివిధ కారణాలతో ఓటింగ్​లో పాల్గొనలేదు.

కాగా, అత్యధిక సంఖ్యా బలం ఉన్న బీఆర్ఎస్​కు.. దాదాపు వెయ్యి ఓట్లు పోల్​కావాల్సి ఉంది. కానీ, ఆ పార్టీకి కేవలం 762 ఓట్లు మాత్రమే పడ్డాయి. అంటే, ఆ పార్టీ నుంచి దాదాపు 238 ఓట్లు క్రాస్​ అయినట్టు తెలుస్తున్నది. అలాగే, 320 సంఖ్యాబలం ఉన్న కాంగ్రెస్​కు.. 653 ఓట్లు పోలయ్యాయి. ఈ లెక్కన ఆ పార్టీకి 333 ఓట్లు అధికంగా వచ్చాయి. ఇందులో బీఆర్ఎస్​ నుంచి 238 ఓట్లతో పాటు బీజేపీకి చెందిన దాదాపు 90 పైచిలుకు 
ఓట్లు క్రాస్​ అయినట్లు తెలుస్తోంది.

చివరి క్షణంలో మారిన సీన్

ఎమ్మెల్సీ బై పోల్​కు నామినేషన్​ల ఉపసంహరణ ముగిసిన మరుసటి రోజు నుంచే బీఆర్ఎస్ ఆ పార్టీ ఓటర్లను చేజారకుండా కాపాడుకునే ప్రయత్నాలు చేసింది. ప్రచార పర్వాన్ని పక్కకు పెట్టి, స్థానిక సంస్థల ఓటర్లను ముందస్తుగా క్యాంపులకు తరలించింది. పోలింగ్​కు పది రోజుల ముందే ఆ పార్టీ ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలను గోవా, ఊటి తదితర ప్రాంతాలకు తరలించింది.

ఓటుకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు పంపిణీ జరిగిందనే టాక్​ నడిచింది. అయితే, క్యాంపుల్లో ఉన్న కొందరికి డబ్బులు అందకపోవడంతో వారు మొండి కేసిన ట్టు వార్తలొచ్చాయి. దీంతో చివరి క్షణంలో సీన్ ​రివర్స్ ​అయింది. వారిని బుజ్జగించేందుకు రెండున్నర తులాల బరువున్న గోల్డ్​ కాయిన్​ను ఇచ్చినట్టు వాట్సాప్​ గ్రూపుల్లో ఫొటోలు కూడా వైరల్ ​అయ్యాయి. కానీ, కొందరు మాత్రం క్రాస్​ ఓటింగ్​కు 
పాల్పడినట్టు తెలుస్తున్నది.