ముడిసరుకుల ధరలు పెరగడంతో నలుగుతున్న మారుతీ

ముడిసరుకుల ధరలు పెరగడంతో నలుగుతున్న మారుతీ
  • కమోడిటీల రేట్లు రికార్డుస్థాయికి చేరాయన్న ఎంఎస్‌‌ఐ
  • ఇక నుంచి తగ్గే చాన్స్‌‌ ఉందని కామెంట్‌‌
  • వెహికల్‌‌ రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకోలేదు
  • ఎంఎస్‌‌ఐ సీనియర్‌‌ ఎగ్జిక్యూటివ్‌‌ శ్రీవాస్తవ

న్యూఢిల్లీ: మనదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌‌‌‌ఐ) మెటల్స్‌‌‌‌, చిప్స్‌‌‌‌, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ వంటి కమోడిటీల ధరల పెరుగుదలపై టెన్షన్‌‌‌‌ పడుతోంది. ధరల పోకడలను జాగ్రత్తగా గమనిస్తోంది. ఇవి తరచూ పెరుగుతుండటంతో కంపెనీకి ప్రొడక్షన్‌‌‌‌ కాస్ట్‌‌‌‌ ఎక్కువ అవుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండో క్వార్టర్‌‌‌‌లో ధరలు బాగా పెరిగాయని కంపెనీ సీనియర్ ఆఫీసర్‌‌‌‌ ఒకరు తెలిపారు. అయినప్పటికీ ధరల భారాన్ని పూర్తిగా కస్టమర్లపైకి నెట్టేయలేదని అన్నారు.  కమోడిటీ ధరలు ఇప్పటికే విపరీతంగా పెరిగినందున, ఇక నుంచి తగ్గుతాయని కంపెనీ భావిస్తోంది. ‘‘ఎంఎస్‌‌‌‌ఐ వంటి ఒరిజినల్‌‌‌‌ ఎక్విప్‌‌‌‌మెంట్‌‌‌‌ మేకర్‌‌‌‌ (ఓఈఎం)లు మెటీరియల్స్‌‌‌‌కు చాలా పెద్దమొత్తంలో ఖర్చు చేస్తాయి. మా ప్రొడక్షన్‌‌‌‌ ఖర్చులో 70 నుంచి 75 శాతం మెటీరియల్ ధరే ఉంటుంది. క్యూ2లో  మెటీరియల్ కాస్ట్ టు నికర అమ్మకాల నిష్పత్తి 80.5 శాతానికి పెరిగింది. ఇంతగా ఎన్నడూ లేదు’’ అని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్  సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ చెప్పారు.

కొంతకాలం ఆగుతాం..

ధరలను పెంచుతున్నారా ? అన్న ప్రశ్నకు ‘‘కొత్త సంవత్సరంలో సాధారణంగా ఆటోమొబైల్‌‌‌‌ కంపెనీలు ధరలను పెంచుతాయి. అయితే మేం పరిస్థితిని జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది, ఎందుకంటే గతంలో కమోడిటీ ధరలు పెరిగినప్పుడు కస్టమర్‌‌‌‌పై పూర్తిగా భారాన్ని మోపలేదు. సెప్టెంబరు మొదట్లో రేట్లను1.9 శాతం వరకు పెంచాం. ఇక నుంచి వస్తువుల ధరల కదలికలను జాగ్రత్తగా గమనిస్తాం. కొంతకాలం తరువాతే నిర్ణయం తీసుకుంటాం’’  అని జవాబిచ్చారు. కమోడిటీ ధరలలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రికార్డుస్థాయిలో పెరిగాయని, అయితే వీటి ఎఫెక్ట్‌‌‌‌ మారుతీ సుజుకి వంటి ఓఈఎంల దాకా రావడానికి కొంత సమయం పట్టిందని వివరించారు. అందుకే తమకు క్యూ2లో ధరల సెగ తగిలిందని ఆయన అన్నారు. గత సంవత్సరం నుంచి వస్తువుల ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయని శ్రీవాస్తవ వివరించారు. ‘‘2020 మే నెల నుండి ఆటోమొబైల్స్‌‌‌‌ తయారీకి సంబంధించిన దాదాపు అన్ని వస్తువుల రేట్లు పెరిగాయి. గత ఏడాది కిలో స్టీలు రేటు రూ.38 కాగా, అది ఇప్పుడు దాదాపు రూ.72లకు చేరింది. టన్నుకు 5,200 డాలర్లుగా ఉన్న రాగి రేటు 10,400 డాలర్లకు చేరుకుంది’’ ఆయన తెలిపారు. వెహికల్స్‌‌‌‌ తయారీకి అవసరమైన పల్లాడియం, ప్లాటినం, రోడియం వంటి ఇతర విలువైన లోహాల ధరలు కూడా దాదాపు రెండు-మూడు రెట్లు పెరిగాయని పేర్కొన్నారు. అయితే గత రెండు వారాల నుంచి ధరలు కొద్దికొద్దిగా దిగివస్తున్నాయని అని శ్రీవాస్తవ చెప్పారు. ప్రస్తుత స్థాయితో పోలిస్తే రానున్న క్వార్టర్లలో ధరల భారం తగ్గుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక నుంచి రేట్లు పెరగకపోవచ్చని తాము అనుకుంటున్నామని అన్నారు.