దేశంలో అగ్రశ్రేణి కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. కార్ల ధరలను సగటున 1.1% పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయం జనవరి 16 నుండి అమలులోకి వస్తుందని తెలిపింది. ధరల పెరుగుదల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. ద్రవ్యోల్బణం, పెరిగిన ఖర్చులను దృష్టిలో ఉంచుకొని కార్ల ధరల దృష్ట్యా రేట్లు పెంచక తప్పదని మారుతీ డిసెంబర్ నెలలోనే చెప్పింది. ఈ నేపథ్యంలో పెంచిన మారుతి కంపెనీకి చెందిన అన్ని మోడల్ కార్ల ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.
గతేడాదిలో అనేక కారణాలతో మారుతీ సుజూకీతో పాటు టాటా మోటార్స్, హ్యుందాయ్, హోండా, ఎంఅండ్ఎం, కియా తదితర సంస్థలు కూడా కార్ల ధరలను భారీగా పెంచేశాయి. ఆ తర్వాత పండగల సీజన్ రావడంతో ధరల పెంపునకు కాస్త బ్రేక్ పడినా.. ఆ తర్వాత మళ్లీ బాదుడు మొదలైంది. ఇదే తరహాలో తమ కంపెనీకి చెందిన మోడల్ వాహనాల ధరలను పెంచుతున్నట్టు టాటా మోటార్స్ రెండు నెలల క్రితమే ప్రకటించింది. వీటితో పాటు ఆడీ, మెర్సిడెస్ బెంజ్తదితర లగ్జరీ కార్ల రేటు కూడా పెరగనున్నాయి.
