ఎక్కువ కాలుష్యం విడుదల చేసే డీజిల్ ఇంజన్లకు బదులు, పెట్రోల్ ఇంజన్లపైనే ఫోకస్ చేయాలని మారుతి నిర్ణయించింది. మరింత మైలేజ్ ఇచ్చేలా పెట్రోల్ ఇంజన్లను తయారు చేస్తామని చెప్పింది. బీఎస్-6 ఎమిషన్స్ రూల్స్ కఠినంగా ఉండటంతో డీజిల్ ఇంజన్లు తయారు చేయడం సవాల్‌గా మారింది. అందుకే ఎంఎస్‌ఐ తన పోర్ట్‌ఫోలియో నుండి డీజిల్ మోడల్స్‌ను తొలగించింది. ప్రస్తుతం మొత్తం ప్యాసింజర్ వెహికల్స్ (పీవీ) అమ్మకాలలో డీజిల్ వెహికల్స్ వాటా 17 శాతం కంటే తక్కువ. 2013-14లో మొత్తం సేల్స్‌లో డీజిల్ కార్ల వాటా 60 శాతం వరకు ఉండేది. ఇప్పటికే దేశంలోని చాలా ఆటో కంపెనీలు డీజిల్ ఇంజన్ల తయారీని ఆపేశాయి.
న్యూఢిల్లీ: డీజిల్ ఇంజన్ల తయారీని పూర్తిగా ఆపేశామని మనదేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్‌ఐ) ప్రకటించింది. డీజిల్ సెగ్మెంట్‌లోకి తిరిగి అడుగుతుపెడుతున్నదంటూ వచ్చిన పుకార్లను తోసిపుచ్చింది. వచ్చే ఏడాది నుంచి ఎమిషన్స్ రూల్స్ మరింత కఠినంగా మారుతాయి కాబట్టి డీజిల్ ఇంజన్ల తయారీ కష్టమవుతుంది. అందుకే వీటిని దూరంగా ఉండాలని కంపెనీ నిర్ణయించుకుంది. బీఎస్–6 రూల్స్ కారణంగా డీజిల్ వెహికల్స్ ధరలు మరింత పెరుగుతాయని, అమ్మకాలు తగ్గుతాయని కంపెనీ భావిస్తోంది. ‘‘డీజిల్ సెగ్మెంట్‌లో ఉండాలని అనుకోవడం లేదు. కస్టమర్ల నుంచి డిమాండ్ ఉంటే తిరిగి డీజిల్ ఇంజన్లవైపు వస్తామని గతంలో ప్రకటించిన మాట నిజమే. ఇక ముందు మాత్రం డీజిల్ ఇంజన్లవైపు చూసే అవకాశం లేదు’’ అని ఎంఎస్‌ఐ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ సీవీ రామన్ తెలిపారు. డీజిల్‌తో నడిచే కార్లను తగ్గించేందుకు కఠినమైన ఎమిషన్స్ రూల్స్ తీసుకొచ్చారని వివరించారు. "2023 నుంచి కొత్త ఎమిషన్స్ రూల్స్ వస్తాయి. వీటి వల్ల తయారీ ఖర్చు పెరిగే అవకాశం ఉంది. ఇక నుంచి డీజిల్ వెహికల్స్ అమ్మకాలు మరింత తగ్గవచ్చని అనుకుంటున్నాం. పోటీ కంపెనీల గురించి మాకు తెలియదు కానీ ఎంఎస్‌ఐ మాత్రం డీజిల్ వెహికల్స్‌ను తయారు చేయదు’’ అని ఆయన స్పష్టం చేశారు.
ఎమిషన్ రూల్స్ వల్లే...
ఎంఎస్‌ఐతోపాటు దాదాపు అన్ని ఇండియా ఆటో కంపెనీలు డీజిల్ బండ్ల తయారీని ఆపేస్తున్నాయి. ప్రస్తుతం డీజిల్ వెహికల్స్ వాటా మొత్తం ప్యాసింజర్ వెహికల్స్ (పీవీ) అమ్మకాలలో 17 శాతం కంటే తక్కువ. 2013–-14లో డీజిల్ బండ్ల వాటా 60 శాతం వరకు ఉండేది. డీజిల్ ఇంజన్లు ఎక్కువ కాలుష్యాన్ని విడుదల చేయడం, మెయింటెనెన్సూ ఎక్కువే కావడంతో కస్టమర్లూ వీటిని కొనేందుకు వెనకాడుతున్నారు. డీజిల్ ఇంజన్ల తయారీని తగ్గించడానికి కేంద్రం గత ఏడాది ఏప్రిల్ లో బీఎస్–6 ఎమిషన్స్ రూల్స్‌ను అమల్లోకి తెచ్చింది. దీంతో కంపెనీలు డీజిల్ మోడల్స్‌ను రద్దు చేస్తున్నాయి. ఎంఎస్‌ఐ కూడా తన పోర్ట్‌ఫోలియో నుండి డీజిల్ మోడల్స్‌ను తొలగించింది. మారుతిలో ఇప్పుడు అన్ని మోడళ్లలో బీఎస్–6 ఇంజన్లు ఉన్నాయి. వీటిలో 1 లీటర్, 1.2 లీటర్ 1.5 లీటర్ కెపాసిటీ గల పెట్రోల్ ఇంజన్లు ఉన్నాయి. ఏడు మోడళ్లలో సీఎన్జీ వేరియంట్లూ ఉన్నాయి. అయితే డీజిల్‌తో పోలిస్తే పెట్రోల్ రేటు కొంచెం ఎక్కువ కాబట్టి ఇక నుంచి పెట్రోల్ ఇంజన్లు మరింత మైలేజీ ఇచ్చేలా డిజైన్ చేస్తామని రామన్ చెప్పారు.
ఇంటర్నల్ కంబశ్చన్ ఇంజన్ టెక్నాలజీ, స్టార్ట్-/స్టాప్ టెక్నాలజీ ద్వారా ప్రస్తుత పవర్‌ట్రెయిన్‌లనూ మెరుగుపరుస్తామని అన్నారు. సెలెరియోలోని కొత్త కే10సీ ఇంజిన్‌ను మరింత బాగా తయారు చేశామని, 1.2 లీటర్ ఇంజన్‌లోనూ కొన్ని మార్పులు తెచ్చామని వివరించారు. ఎంఎస్‌ఐ ఇటీవలే తీసుకొచ్చిన సెలెరియో సరికొత్త వెర్షన్ లీటరుకు 26.68 కిమీ మైలేజ్ ఇస్తుందని, మనదేశంలో మరే పెట్రోల్-ఆధారిత కారు ఇంత మైలేజ్ ఇవ్వడం లేదని మారుతి ప్రకటించింది. ఇక నుంచి సీఎన్జీ మోడల్స్‌పై మరింత ఫోకస్ చేస్తామని, ఈ సెగ్మెంట్లో మరిన్ని మోడల్స్ తీసుకువస్తామని వెల్లడించింది. తక్కువ రన్నింగ్ కాస్ట్ కారణంగా సీఎన్జీ బండ్లకు డిమాండ్ పెరుగుతోంది. హైబ్రిడ్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ బండ్లపైనా ఫోకస్ చేస్తామని రామన్ పేర్కొన్నారు. పెట్రోల్ వాడకాన్ని తగ్గించడానికి తమ ఇంజన్లు 10 శాతం ఇథనాల్ ఉపయోగించుకునేలా డిజైన్ చేశామని అన్నారు.
