Martin Guptill: 14 ఏళ్ళ కెరీర్‌కు గుడ్ బై: అంతర్జాతీయ క్రికెట్‌కు న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్

న్యూజిలాండ్ స్టార్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 14 ఏళ్ళ పాటు న్యూజిలాండ్ తరపున ఆడిన గప్తిల్ బుధవారం (జనవరి 8) తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. "చిన్న వయసులో న్యూజిలాండ్‌కు ఆడాలనేది నా కల. నా దేశం కోసం 367 మ్యాచ్ లు ఆడినందుకు నేను చాలా అదృష్టవంతుడిని. ఇన్ని సంవత్సరాలుగా నాకు సహాయపడిన సహచరులు, కోచింగ్ సిబ్బందికి నేను చాలా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా అండర్ 19 స్థాయి నుండి నాకు శిక్షణనిచ్చిన మార్క్ ఓ'డొనెల్ నా కెరీర్ లో మర్చిపోలేను". అని గప్తిల్ రిటైర్మెంట్ అనంతరం చెప్పుకొచ్చాడు. 

38 ఏళ్ల గప్టిల్ జనవరి 2009లో వెస్టిండీస్ తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్ ద్వారా న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. అదే సంవత్సరం ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాపై టీ20ల్లో.. మార్చి భారత్ పై టెస్ట్ ల్లో ఎంట్రీ ఇచ్చాడు. తన 14 ఏళ్ళ కెరీర్ లో న్యూజిలాండ్ తరఫున 198 వన్డేలు, 122 టీ20లు, 47 టెస్టులు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 23 అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు. వన్డేల్లో 7346 పరుగులు చేసిన ఈ కివీస్ ఓపెనర్.. రాస్ టేలర్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తర్వాత న్యూజిలాండ్ తరపున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా నిలిచాడు. 

3,531 పరుగులతో  టీ20 ఫార్మాట్ లో న్యూజిలాండ్ తరపున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా నిలిచాడు. అతను చివరిసారిగా 2022లో న్యూజిలాండ్ తరపున బంగ్లాదేశ్ పై చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. గుప్తిల్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయినప్పటికీ   దేశీయ క్రికెట్.. టీ20 ఫ్రాంచైజీ క్రికెట్ ఆడటం కొనసాగిస్తాడు. ప్రస్తుతం అతను సూపర్ స్మాష్‌లో లీగ్ లో ఆక్లాండ్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. 2019 వన్డే వరల్డ్ కప్ లో ధోనీ రనౌట్ చేసి న్యూజిలాండ్ వరల్డ్ కప్ ఫైనల్ కు వెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు.