సమగ్ర కుల గణన సర్వే.. పెండ్లయిన ఆడబిడ్డ కూడా కుటుంబ సభ్యురాలే

తెలంగాణ  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  సమగ్ర  కులగణన సర్వే  నవంబర్ 6వ  తేదీ నుంచి ప్రారంభం కానున్నది.  ఈ విషయం అందరికీ తెలిసిందే.  ఇంటింటికీ తిరిగి  నిర్వహించనున్న ఈ  సర్వేలో  54 ప్రశ్నలు,  కొన్ని ఉప ప్రశ్నలున్నట్టు  తెలుస్తున్నది.  అయితే,  వీటన్నింటిలో  ప్రథమ భాగంలో అడిగే  కుటుంబ వివరాల విషయంలో ప్రభుత్వం  నుంచి ఒక వివరణ అవసరమవుతున్నది.

అంతేకాదు..  ప్రజలకు,  సర్వేయర్లకు ఈ విషయాలపై  చక్కటి అవగాహన  కల్పించాల్సిన  అవసరముంది. సాధారణంగా   ఏ  ప్రయోజనానికైనా  కుటుంబ సభ్యుల పేర్లను  ప్రస్తావించవలసి  వచ్చినప్పుడు  చాలామంది  అనుసరించే విధానం  వివాహమైన కూతుళ్ళను తమ కుటుంబ సభ్యుల  వివరాల్లో చేర్చడం లేదు.

కూతురుకి వివాహం చేయడంతోనే,  కూతురు పట్ల తమ బాధ్యత ముగిసిందని, ఇక  ఆమె తమ కుటుంబ సభ్యురాలు కాదని చాలామంది భావిస్తుంటారు. అయితే, ఈ మధ్యనే 18- అక్టోబర్​2024  తీర్పు వెలువరించిన  సిరిపల్లి అమ్ములుVS  స్టేట్​ఆఫ్​ ఏపీ ( WP/7059/2021)  కేసులో  ఈ విధానం తప్పని ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. వివాహమైన  కొడుకులు  ఒక  కుటుంబ యజమాని కుటుంబంలో   సభ్యులుగా పేర్కొంటున్నప్పుడు,   వివాహితల  పట్ల వివక్ష  చూపడం  సరికాదన్నది ఆ తీర్పులోని సారాంశం.

అంతేకాదు  వివాహితైన  స్త్రీ తన తండ్రి కుటుంబంలో  జీవితాంతం సభ్యురాలేనని తేల్చి చెప్పింది ఉన్నత న్యాయస్థానం.  అందువల్ల తెలంగాణలో  సమగ్ర  కుల గణన సర్వే  జరుపనున్న సందర్భంలో,    ఈ విషయంపై   ప్రజలకు అంతేగాక  సర్వేయర్లకు  చక్కని  అవగాహన కల్పించాల్సిన బాధ్యత  ప్రభుత్వం మీద ఉంది.   కాబట్టి,  తెలంగాణ  ప్రభుత్వాధికారులు  రూపొందించిన  సర్వే  ప్రశ్నావళి  విషయంలో,  ప్రభుత్వం, న్యాయ నిపుణులను సంప్రదించి  ప్రశ్నావళికి  అవసరమయితే  మార్పులు, చేర్పులు చేపట్టవలసిన అవసరముంది.

- బసవరాజు నరేందర్ రావు