న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్ ప్రొడక్ట్‌లను తయారు చేసే జర్మనీ ఎంఎన్‌సీ సీమన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ బుధవారం రూ. లక్ష కోట్లను దాటింది. ఇంట్రాడేలో ఒక శాతం మేర పెరిగి బీఎస్‌ఈలో రూ. 2,849 వద్ద ఏడాది గరిష్టాన్ని కంపెనీ నమోదు చేసింది. ఈ లెవెల్ దగ్గర కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 1.01 లక్షల కోట్లకు చేరుకుంది. కంపెనీ షేరు చివరికి రూ. 2,805 వద్ద ఫ్లాట్‌గా ముగిసింది.
ఈ ఏడాది ఇప్పటి వరకు సీమన్స్ షేరు 19 శాతం పెరిగింది. కంపెనీ కన్సాలిడేటెడ్ రెవెన్యూ ఈ ఏడాది జూన్ క్వార్టర్ (క్యూ1)లో 51 శాతం (ఏడాది ప్రాతిపదికన) పెరిగి రూ. 4,198 కోట్లకు చేరుకుంది. సీమన్స్‌కు క్యూ1 లో ఎనర్జీ బిజినెస్ నుంచి రూ. 1,454.4 కోట్ల రెవెన్యూ రాగా, స్మార్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్ నుంచి రూ. 1,506 కోట్లు, మొబిలిటీ బిజినెస్ నుంచి రూ. 391.1 కోట్ల ఆదాయం వచ్చింది.
