నల్లమలలో గంజాయి కలకలం

అమ్రాబాద్, వెలుగు: నల్లమల ఏజెన్సీ ప్రాంతంలోని తుర్కపల్లి గ్రామంలో గంజాయి సాగు కలకలం రేపుతోంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కౌలు రైతు ఎనుపోతుల నారాయణ పొలంలో గంజాయి సాగు చేస్తున్నాడు. రెండు రోజుల కింద అర్ధరాత్రి మండలానికి చెందిన కొందరు యువకులు గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. దొంగలనే అనుమానంతో గ్రామస్తులు వారిని పట్టుకుని చితకబాదారు.

దీంతో తాము దొంగలం కాదని, ఒకరి పొలంలో గంజాయి సాగు చేస్తుంటే తీసుకెళ్లడానికి వచ్చినట్లు తెలిపారు. వారి వద్ద ఉన్న మూటలో అర కిలో గంజాయి ఉన్నట్లు గుర్తించారు.  పోలీసులకు సమాచారం ఇచ్చి వారిని అప్పగించారు. గ్రామస్తుల ఫిర్యాదుతో రెవెన్యూ, బ్లూ కోల్ట్  సిబ్బంది పొలాన్ని పరిశీలించి మిరప చేనులో అంతర్  పంటగా సాగు చేసిన 5 ఎండిన గంజాయి మొక్కలను గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సయ్యద్  నిజాముద్దిన్  ఖాద్రీ తెలిపారు.