మరాఠీ నటి కేతకి చితాలేకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు వ్యతిరేకంగా ఆమె చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర పోలీసులు నమోదు చేసిన 21 ఎఫ్ఐఆర్ లపై కోర్టు స్టే విధించింది. ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. కాగా కొన్ని రోజుల క్రితం శరద్ పవార్ కు వ్యతిరేకంగా ఆమె తన ఫేస్బుక్లో ఓ వివాదస్పద పోస్టు చేసింది. నరకం ఎదురుచూస్తుంది..బ్రాహ్మణ ద్వేషి అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. దీంతో పవార్ మద్ధతుదారుల ఫిర్యాదుతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై పలు స్టేషన్లలో ఆమెపై కేసులు కూడా నమోదయ్యాయి.
అయితే సుమారు 40రోజులు జైల్లో ఉన్న కేతకికి జూన్ 23న కోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఇక ఈ బెయిల్ విచారణ సందర్భంగా కోర్టు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేతకి అరెస్ట్ సమయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో పోలీసుల తరుపున పీపీ కోర్టుకు క్షమాపణలు తెలిపారు. అయితే కోర్టు తాజా తీర్పుతో ఈ అంశంలో ఆమెకు మరింత ఊరట లభించింది.
