ఐఈడీ పేల్చిన మావోయిస్టులు.. ఇద్దరు పారామిలిటరీ జవాన్లు మృతి

ఛత్తీస్‎గఢ్‎లో మావోయిస్టులు మరో ఘాతుకానికి ఒడిగట్టారు. ఐఈడీ పేల్చి ఇద్దరు జవాన్లను అంతమొందించారు. భద్రతాదళాల అధికారుల వివరాల ప్రకారం.. శనివారం (2024, అక్టోబర్ 19) మధ్యాహ్నం ఐటీబీపీ, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్‌ల బృందాలు దుర్బెడలో ఆపరేషన్ నిర్వహించి నారాయణపూర్‌కి తిరిగి వస్తుండగా అబుజ్‌మడ్ ప్రాంతంలోని కొడ్లియార్ గ్రామ సమీపంలో మావోయిస్టులు అమర్చిన ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరం (ఐఈడీ) పేలిందని తెలిపారు. 

ఈ పేలుడు ధాటికి ఇద్దరు ఐటీబీపీ జవాన్లు వీరమరణం పొందారని వెల్లడించారు. మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారని.. ప్రస్తుతం వారికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోందని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని సతారాకు చెందిన అమర్ పన్వర్, ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందిన కె రాజేష్ అనే జవాన్లు ఈ ఘటనలో మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతులిద్దరి ఐటీబీపీ విభాగంలోని 53వ బెటాలియన్‌లో పని చేస్తున్నట్లు తెలిపారు. 

కాగా, ఛత్తీస్‎గఢ్‎లోని అబుజ్‌మడ్ ప్రాంతంలో భద్రతా బలగాలు అక్టోబరు 4న జరిపిన భారీ అపరేషన్‎లో 38 మంది మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్ 24 ఏళ్ల చరిత్రలో ఇదే అతిపెద్ద ఆపరేషనని అధికారులు తెలిపారు. ఈ ఎన్ కౌంటర్‎తో భారీగా దెబ్బతిన్న మావోయిస్టులు భద్రతా దళాలపై ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. ఇందులో భాగంగానే భారీ ఎన్ కౌంటర్ జరిగిన రెండు వారాల్లోనే ఐఈడీ పేల్చి జవాన్లను అంతమొందించారు. మరోవైపు ఛత్తీస్ గఢ్‎లో మావోయిస్టుల ఏరివేత అపరేషన్‎ను భద్రతా దళాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి.