ఇంటిముందే ఉరితీసిన్రు

ఇంటిముందే ఉరితీసిన్రు

పాట్నా: బీహార్ లోని గయ జిల్లా మోన్బర్ గ్రామంలో మావోయిస్టులు ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని ఇంటిముందే పశువుల కొట్టానికి ఉరితీశారు. ఆ తర్వాత పెంకుటిల్లును డైనమైట్ పెట్టి పేల్చేశారు. గతంలో విషం కలిపిన ఆహారం పెట్టి, నలుగురు నక్సల్స్ మృతికి కారణమైనందుకే వీళ్లను ఉరి తీస్తున్నట్లు మావోయిస్టులు నోట్ లో పేర్కొన్నారు. ఏడాది కింద మోన్బర్ కు వచ్చిన నలుగురు నక్సల్స్ ఎన్ కౌంటర్ లో చనిపోయారు. గ్రామంలోని సర్జూ భోక్తా ఇంట్లో ఆశ్రయం పొందిన నలుగురు నక్సల్స్ కు సర్జూ కొడుకులు సత్యేంద్ర సింగ్ భోక్తా, మహేంద్ర సింగ్ భోక్తా, వాళ్ల భార్యలు విషం కలిపిన ఆహారం పెట్టారని, తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారని, పోలీసులు వచ్చి ఫేక్ ఎన్ కౌంటర్ చేశారని మావోయిస్టులు అనుమానించారు. ఈ క్రమంలో శనివారం గ్రామానికి వచ్చిన మావోయిస్టులు ప్రజా కోర్టు నిర్వహించారు. ఇద్దరు అన్నదమ్ములను, వాళ్ల భార్యలను చేతులు కట్టేసి, కండ్లకు గంతలు కట్టి ఇంటి ముందు పశువుల కొట్టానికి ఉరితీశారు. ఆ తర్వాత ఇంటిని పేల్చేశారు. వీరు హత్య, కుట్ర నేరాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఇంటి గోడకు ఒక నోట్ ను అతికించారు.