వైభవంగా మన్యంకొండ రథోత్సవం

మహబూబ్ నగర్ రూరర్, వెలుగు: మన్యంకొండ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామి వారి రథోత్సవం వైభవంగా జరిగింది. స్వామి వారి ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఊరేగింపుగా రథం వరకు తీసుకువచ్చారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను రథంలో ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్  గుగులోత్​ రవినాయక్​ పూజలు చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. 

భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ రథోత్సవంలో పాల్గొన్నారు. మన్యంకొండంపై ఉన్న శివాలయం, పద్మావతి అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. రాష్ట్రం నుంచే కాకుండా ఏపీ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారికి తలనీలాలు సమర్పించుకొని కోనేరులో స్నానం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త అలహరి మధుసూదన్ కుమార్, అర్చకులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.