డీసీసీ పీఠంపై నేతల నజర్

  • రేసులో పలువురు లీడర్లు
  • నామినేటెడ్ లేకుంటే డీసీసీ పదవి
  • తెరపైకి బీసీ కార్డు

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట డీసీసీ పీఠాన్ని చేజిక్కించుకోవడానికి పలువురు ముఖ్య నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొత్త జిల్లా కమిటీల ఏర్పాటుకు కసరత్తు జరుగుతుండడంతో పలువురు నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. దశాబ్ద  కాలం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో  పాటు  స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో డీసీసీ పదవి కీలకంగా మారుతుండడంతో జిల్లాకు సంబంధించిన కొందరు ముఖ్య నేతలు ఎలాగైనా డీసీసీ అధ్యక్ష పదవిని సాధించాలనే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. 

ఈ నేపథ్యంలో కొందరు బీసీలకే డీసీసీ అవకాశం ఇవ్వాలనే స్లోగన్ ను ముందుకు తెస్తున్నారు. జిల్లా నుంచి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి పదవి లభించడంతో డీసీసీ పదవిని అప్పగించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డినే కొనసాగిస్తారా లేక ఇతరులకు పదవిని అప్పగిస్తారనే దానిపై జిల్లాలో చర్చ 
జరుగుతోంది. 

డీసీసీపై సీనియర్ల ఆసక్తి

జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై పలువురు సీనియర్లు ఆసక్తి చూపుతున్నారు. వీరిలో చాలా మంది నామినేటెడ్ పదవులను కోరుతున్నా అవి లభించకుంటే కనీసం డీసీసీ అధ్యక్ష పదవిని ఇవ్వాలని హై కమాండ్ ను కోరుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్​రావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయాలంటే సీనియర్లకే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ప్రస్తుత  డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, చెరుకు శ్రీనివాసరెడ్డి, గాడిపల్లి రఘువర్థన్ రెడ్డి, అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, పూజల హరికృష్ణ, దర్పల్లి చంద్రం పేర్లు డీసీసీ పోస్టుకు ప్రముఖంగా వినపడుతున్నాయి. 

నామినేటెడ్ పోస్టు ఇవ్వకుంటే డీసీసీ అధ్యక్ష పదవిని మరోసారి అప్పగించినా సిద్ధమేనని తూంకుంట నర్సారెడ్డి హైకమాండ్​కు సంకేతాలు పంపినట్టు తెలుస్తోంది. జడ్పీటీసీగా పోటీ చేసి జిల్లా పరిషత్ చైర్మన్ పై దృష్టి పెట్టిన చెరుకు శ్రీనివాసరెడ్డికి హైకమాండ్​డీసీసీ బాధ్యతలు అప్పగిస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. డీసీసీ పదవిని ఆశిస్తున్న తూంకుంట నర్సారెడ్డి, చెరుకు శ్రీనివాసరెడ్డి, పూజల హరికృష్ణ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసి పరాజయం పాలైనా నియోజకవర్గ స్థాయిలో వారే ఇన్​చార్జిలుగా కొనసాగుతున్నారు.

డీసీసీ బీసీకా.. ఓసీకా..

డీసీసీ పదవి ఈసారి బీసీలకా లేక ఓసీలకిస్తారా అనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ఐదేండ్లుగా డీసీసీ అధ్యక్షుడిగా తూంకుంట నర్సారెడ్డి కొనసాగుతుండడంతో ఈసారైనా బీసీలకు అవకాశం ఇవ్వాలనే చర్చను కొందరు ముందుకు తెస్తున్నారు. బీసీలకే డీసీసీ అధ్యక్ష పదవిని కేటాయించాలని భావిస్తే సిద్దిపేట నియోజకవర్గం నుంచి పూజల హరికృష్ణ, దర్పల్లి చంద్రం పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్  సూచించిన వ్యక్తికే  డీసీసీ పదవి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

ఇటీవల హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన కేడం లింగమూర్తికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి దక్కేలా చూడడంతో డీసీసీ అధ్యక్ష పదవి విషయంలో పొన్నం మాటే కీలకం కానున్నది. దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా జిల్లాలో మెజార్టీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో రానున్న రోజుల్లో పార్టీని పటిష్టపరిచే సమర్థుడైన నాయకుడిని గుర్తించే బాధ్యత మంత్రిపైనే ఉందని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఏది ఏమైనా స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట డీసీసీ అధ్యక్ష పదవి ఎంపిక ఇప్పుడు కాంగ్రెస్ లో హాట్ టాపిక్​గా మారింది.