ఆక్రమణలే ముంచాయ్ .. రెండు రోజుల వర్షాలకే  మునిగిన కాలనీలు

  • అమీన్​పూర్​లో చెరువులు, ఎఫ్టీఎల్,  నాలాల స్థలాల్లో ఇండ్ల నిర్మాణాలు
  • గుడ్డిగా పర్మిషన్లు ఇచ్చిన ఆఫీసర్లు

సంగారెడ్డి, వెలుగు: రెండు రోజుల వర్షానికే సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​మండలం, మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. అమీన్ పూర్ పెద్ద చెరువు కింద కృష్ణ బృందావన్ కాలనీ, చక్రపురి కాలనీ కుంటలను తలపిస్తున్నాయి. సర్వే నంబర్ 947లోని శెట్టి కుంట చెరువు స్థలంలో ఇళ్ల నిర్మాణాలు, తీగల సాగర్ చెరువు ఎఫ్టీఎల్ ఆక్రమణ, కిష్టారెడ్డిపేట నక్కలపాడు కుంట ఎఫ్టీఎల్, బఫర్ జోన్, శంభునికుంట ఆక్రమణలు, బంధంకొమ్ము చెరువుల అలుగులను కబ్జా చేసి ఇండ్ల నిర్మాణాలు చేయడంతో ఆయా ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి.  

అడ్డగోలుగా పర్మిషన్లు

అమీన్ పూర్ మండలంతో పాటు మున్సిపాలిటీలోని చెరువులు, నాలాల స్థలాల్లో జరిగిన నిర్మాణాలకు ఆఫీసర్లు పర్మిషన్లు ఇచ్చి అమాయక ప్రజలను నట్టేట ముంచారు. ఆ స్థలాల్లో అక్రమ కట్టడాలు జరిగినట్టు ఇటీవల హైడ్రా డ్రోన్ ద్వారా సర్వే కూడా చేసింది.  జిల్లా యంత్రాంగం సమగ్ర నివేదికలు తయారుచేసి హైడ్రాకు ఇచ్చినట్లు సమాచారం. అమీన్​పూర్​పెద్ద చెరువు పరిధిలో హెచ్ఎండీఏ లేఔట్లలో వెలిసిన 10 కాలనీల్లో వరద నీరు వచ్చి చేరింది. ఇక్కడ పెద్ద అపార్ట్​మెంట్లు నిర్మించడంతో ప్రస్తుతం అవి జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని గతంలో గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ  అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడంతో ప్రస్తుతం ఆయా కాలనీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వానకాలం వచ్చిందంటే అమీన్​పూర్​పరిసర ప్రాంతాల్లోని చాలా కాలనీలు జలదిగ్బంధంలో ఉండిపోతున్నాయి.

జిల్లాలో అక్కడక్కడ..

జిల్లాలోని సంగారెడ్డి, సదాశివపేట, నారాయణఖేడ్ మున్సిపాలిటీల్లో కూడా చిన్నపాటి వర్షం పడితే లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. సంగారెడ్డిలో నాల్సబ్ గడ్డ, రాజంపేట, మార్క్స్ నగర్, కింది బజార్ వంటి కాలనీల్లో వరద నీరు ఇళ్లల్లోకి చేరడంతో బకెట్లతో ఎత్తిపోసుకుంటున్నారు. సదాశివపేట మున్సిపాలిటీ లోతట్టులో ఉన్న రాఘవేంద్రనగర్ కాలనీలో తరచూ వరదనీరు చేరి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఊబ చెరువు ఎఫ్టీఎల్ ప్రాంతంలో ఇండ్లు నిర్మించుకోగా అక్కడ ముంపు సమస్య ఏర్పడుతోంది. నారాయణఖేడ్ మున్సిపాలిటీలో కొన్నిచోట్ల ప్రధానదారులు సైతం వరద నీటితో మునిగిపోయాయి. ఆయా సమస్యలకు ప్రధానంగా నాలాల కన్వర్షన్ సరిగ్గా లేకపోవడం, అక్రమ నిర్మాణాలు చేపట్టడమే కారణమని పలు సర్వేలు రుజువు చేశాయి. అయినా మున్సిపల్, నీటిపారుదల శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

చర్యలు తీసుకుంటాం

అమీన్​పూర్​ పరిధిలోని చెరువులు, నాలాల ఆక్రమణలపై గతంలో కోర్టులను ఆశ్రయించారు. కొంత కాలానికి ఆయా కబ్జాలపై ఎన్జీటీ నోటీసులు జారీ చేసింది. ఈ విషయం తాజాగా హైడ్రా దృష్టికి వెళ్లింది. చెరువులను ఎవరైనా ఆక్రమిస్తూ మట్టితో పూడిస్తే వెంటనే యాక్షన్ తీసుకుంటున్నాం. చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణలపై రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సమష్టిగా సర్వే చేపడుతున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆక్రమణలపై చర్యలు తీసుకుంటాం. రామస్వామి, డీఈ, ఇరిగేషన్ శాఖ