రాహుల్ స్థానంలో అతన్ని తీసుకోండి.. కష్టాల్లో ఆదుకోగలడు: మాజీ క్రికెటర్

బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఓటమి పాలైన విషయం విదితమే. తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలిన రోహిత్ సేన.. రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగులతో పర్వాలేదనిపించినప్పటికీ ఓటమి నుంచి గట్టెక్కలేకపోయింది. ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలోనూ విఫలమైన భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌పై వేటు వేయాలని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సెలెక్టర్లకు సూచించాడు.

కివీస్‌తో జరగబోయే తదుపరి రెండు టెస్టులకు రాహుల్‌ను తప్పించి.. అతని స్థానంలో దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటుతున్న యువ ప్లేయర్ అభిమన్యు ఈశ్వరన్‌ను ఎంపిక చేయాలని తివారీ.. సెలెక్టర్లకు సూచించాడు. రాహుల్‌కు అనుభవం ఉన్నప్పటికీ, అతని టెస్ట్ సగటు 33.98 తక్కువగా ఉన్న విషయాన్ని తివారీ ఎత్తి చూపాడు. ఇటీవలి మ్యాచ్‌లలో ఈశ్వరన్‌ ఆకట్టుకుంటున్న తీరును ఈ బెంగాల్ క్రికెటర్ హైలైట్ చేశాడు.

"మీరు 91 ఇన్నింగ్స్‌లు ఆడి, 33.98 సగటు గురించి ఆలోచించేవారైతే.. దేశవాళీ క్రికెట్‌లో ఈమాత్రం నిలకడగా రాణిస్తున్న బ్యాటర్లు భారత్‌లో చాలా మంది ఉన్నారు. కేఎల్ రాహుల్ స్థానాన్ని పునరాలోచించండి.. ఎందుకు?.." అని క్రిక్‌బజ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తివారీ మాట్లాడారు.

Also Read :- తొలి ఇన్నింగ్స్‌ మా కొంప ముంచింది: రోహిత్ శర్మ

"టెస్ట్ ఫార్మాట్‌లో సర్ఫరాజ్ ఖాన్‌ను నాలుగో స్థానంలో పంపి అతని నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టారు. ఇది చాలా మంచి విషయం. ఇలానే దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటుతున్న అభిమన్యు ఈశ్వరన్‌ను కూడా భారత జట్టుకు ఎంపిక చేయాలి. అతను స్పెషలిస్ట్ ఓపెనర్. ఇటీవల ఆడిన మ్యాచ్‌ల్లో అతని గణాంకాలను పరిశీలిస్తే.. సెంచరీ చేయని ఇన్నింగ్స్‌లు లేవు. మంచి ఫామ్‌‌లో ఉన్నాడు. ఏ స్థానంలోనైనా రాణించగలడు. కావున అతన్ని తీసుకుని, మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా ప్రయత్నించండి..": అని తీవారి చెప్పుకొచ్చాడు.

2013 డిసెంబర్‌లో బెంగాల్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఈశ్వరన్‌.. గత కొన్నేళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. గత 6 ఇన్నింగ్స్‌ల్లో 4 శతకాలు నమోదు చేశాడు. ఇరానీ కప్‌లో ముంబైపై రెస్టాఫ్ ఇండియా తరఫున 191 పరుగులు, దులీప్ ట్రోఫీ‌లో ఇండియా బీ తరఫున 157 పరుగులతో రాణించాడు. దాంతో, అతన్ని జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.