ప్లాస్టిక్ ఫ్రీ ఏటీఆర్ కు సహకరించాలి : ఈశ్వర్

అమ్రాబాద్, వెలుగు: అమ్రాబాద్  టైగర్  రిజర్వ్ ను ప్లాస్టిక్  ఫ్రీ జోన్ గా మార్చేందుకు అందరూ సహకరించాలని మన్ననూర్  ఎఫ్ఆర్వోవో ఈశ్వర్  పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని మన్ననూర్  గ్రామంలోని షాప్  ఓనర్లకు ఫారెస్ట్  ఆఫీసర్లు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎస్​ ఆదేశాల మేరకు ఏటీఆర్​ను శనివారం నుంచి ఈ నెల 30 వరకు గ్రేస్  పీరియడ్ గా తీసుకొని ప్లాస్టిక్  ఫ్రీ జోన్  అమలుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. షాపుల్లో ప్లాస్టిక్  వస్తువులు వాడవద్దని, వాటి స్థానంలో ప్రత్యామ్నాయ వస్తువులు ఉపయోగించాలని సూచించారు. 

వాటర్, ఇతర సాఫ్ట్  డ్రింక్స్  బాటిల్స్, బిస్కెట్స్, పార్శిల్  కవర్లు, గ్లాసులు, ప్లేట్లు వంటి వాటిని 30 రోజుల్లోగా పూర్తిగా వాడడం మానేయాలన్నారు. వాటికి బదులు అట్టపెట్టెలు, పేపర్  కవర్లు, జూట్  బ్యాగ్స్, పేపర్  ప్లేట్స్, గాజు, స్టీల్  బాటిల్స్  వాడాలని సూచించారు. పర్యాటకులు సైతం ప్లాస్టిక్  వస్తువులు వెంట తెచ్చుకోవద్దన్నారు. త్వరలో దుర్వాసుల చెక్ పోస్ట్  వద్ద వాటర్  ప్లాంట్  ఏర్పాటు చేసి నామినల్  రేట్లకు అందుబాటులో ఉంచుతామన్నారు. 

ఇప్పటికే  ఆకుల ప్లేట్స్, జూట్  బ్యాగ్స్  తయారు చేస్తున్నామని, వాటిని ప్రజలకు తక్కువ ధరల్లో అందుబాటులో ఉండేలా చేస్తామన్నారు. వచ్చే నెల 1 నుంచి ప్లాస్టిక్  వాడకం పూర్తిగా నిషేధించనున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజలు, పర్యాటకులు ఏటీఆర్  ప్లాస్టిక్  ఫ్రీ జోన్  ఏర్పాటుకు సహకరించాలని కోరారు.