మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‎కు సోనియా, రాహుల్ నివాళులు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతికాయాన్ని తరలించారు. శుక్రవారం (డిసెంబర్ 27) ప్రముఖుల సందర్శనార్థం మన్మోహన్ సింగ్ పార్థివదేహాన్ని ఆయన నివాసంలో ఉంచగా.. ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు, సీడబ్ల్యూసీ అగ్రనేతల సందర్శనార్థం శనివారం (డిసెంబర్ 28) ఉదయం ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్‎కు తరలించారు. ఉదయం 10.30 వరకు ఏఐసీసీ కార్యాలయంలోనే మన్మోహన్ సింగ్ పార్థివదేహాన్ని ఉంచనున్నారు. మన్మోహన్ సింగ్‎కు కడసారి నివాళులు అర్పించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు, సీడబ్ల్యూసీ మెంబర్స్ ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. 

కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇతర నేతలు ఏఐసీసీ ఆఫీస్‎లో మన్మోహన్ సింగ్‎కు నివాళులు అర్పించారు. ఉదయం 11.45 నిమిషాలకు మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు కేంద్ర హోంశాఖ, రక్షణ శాఖ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఏఐసీసీ కార్యాలయం నుండి నిగమ్ బోథ్ ఘాట్ వరకు మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర సాగనుంది. 

కాగా, ప్రముఖ ఆర్థికవేత్త, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 2024, డిసెంబర్ 26వ తేదీన మరణించిన విషయం తెలిసిందే. అనారోగ్యానికి గురైన మన్మోహన్ సింగ్ ఢిల్లీ ఎయిమ్స్‎లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. భారత్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని గట్టెక్కించిన గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్. 

ఆర్థికవేత్తగా, ప్రధానిగా పది సంవత్సరాలు పాలించిన మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా కేంద్ర ప్రభుత్వం ఏడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్థిక రంగంలో విశేష కృషి చేసి భారత్ ను ప్రపంచదేశాల ముందు భారత్ తలెత్తుకుని నిలబడేలా కృషి చేసిన మన్మోహన్ సింగ్‎కు.. ఆయన గౌరవార్ధం అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయించింది.