హైదరాబాద్‎లో మన్మోహన్ సింగ్ స్మారకం: మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‎లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర తెలిపేలా స్మారకం ఏర్పాటు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. హైదరాబాద్‎తో పాటు జిల్లాల్లోనూ మన్మోహన్ సింగ్ విగ్రహాలు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఇటీవల మరణించిన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‎కు సంతాపం తెలిపేందుకు తెలంగాణ అసెంబ్లీ సోమవారం (డిసెంబర్ 30) ప్రత్యేకంగా భేటీ అయ్యింది. 

మన్మోహన్ సింగ్‎కు భారత రత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై మంత్రి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచం మొత్తం మెచ్చిన ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. ఉన్నత స్థానాల్లో ఉన్నప్పటికీ.. ఆయన ఎప్పుడు నిరాడంబరంగా జీవించేవారని.. పార్లమెంట్‎కు కూడా మన్మోహన్ సింగ్ లంచ్ బాక్స్ తెచ్చుకునేవారని చెప్పారు.

Also Read : మన్మోహన్ కృషి వల్లే హైదరాబాద్ కు మెట్రో, ఓఆర్ఆర్

దేశంలో నోట్లు రద్దు చేస్తే భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోందని మన్మోహన్ సింగ్ ఎప్పుడు చెప్పేవారని.. కేంద్ర ప్రభుత్వం 2016లో నోట్లు రద్దు చేసిన తర్వాత మన్మోహన్ సింగ్ చెప్పిందే నిజమైందని.. దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందన్నారు. రెండేళ్ల కిందట 92 ఏళ్ల వయసులోనూ మన్మోహన్ సింగ్ ధర్నా చేశారని .. అప్పుడు తనకు ఆయనను కలిసే అవకాశం వచ్చిందని ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి యాది చేసుకున్నారు.